ఢిల్లీ అసెంబ్లీకి ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ను చిత్తు చేసింది. ఈ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ ను సున్నాకు పరిమితం చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ కి తీవ్రమైన పోటీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి మాత్రం బీజేపీని చిత్తు చేసింది. 31 సీట్ల దగ్గర నుంచి మూడు సీట్ల దగ్గరకు తెచ్చినిలబెట్టింది

ఈ విధంగా ఈ రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీలను చిత్తు చేసింది. మరి పైకి ఈ విధంగా కనిపిస్తున్నా... ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో చిత్తైన మూడో పార్టీ కూడా ఉంది. ఆమ్ ఆద్మీ ఇచ్చిన షాక్ కు ఇప్పుడు ఆ పార్టీ జాతీయ హోదా కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురవుతోంది.

అదే బీఎస్పీ.. మాయవతి ఆధ్వర్యంలోని ఈ పార్టీ ఉత్తరప్రదేశ్ కు దగ్గరగా ఉండే ఢిల్లీలో కూడా విస్తరించింది. బీఎస్పీ అంతో ఇంతో ఉనికిలో ఉండే రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. అయితే ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఎస్పీ చిత్తు అయ్యింది. అప్పుడే ఎన్నికల కమిషన్ బీఎస్పీ అగ్రనాయకత్వానికి లేఖ రాసిందట, మీకు తగిన ఓటింగ్ పర్సెంటేజీ లేదు.. మీజాతీయ గుర్తింపును రద్దు చేస్తాము అని.. అయితే మాయవతి ఈసీని కన్వీన్స్ చేసుకొంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ తమకు అవకాశం ఇవ్వాలని కోరింది. అందుకు తగ్గట్టుగా వేచి చూసిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు మాత్రం ఇక వేచి చూడటం ఉండదని తెలుస్తోంది. ఢిల్లీలో బీఎస్పీ అభ్యర్థులు ఎవ్వరూ పరువు నిలుపుకోలేదు. మెజారిటీ దక్కించుకొన్నది కూడా కేవలం ఒక్కరంటే ఒక్కరే! దీంతో మినిమం పర్సెంటేజీ ఓట్లను కూడాసాధించుకోలేకపోయిన బీఎస్పీకి జాతీయ పార్టీ గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సృష్టించిన సునామీతో బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రమే గాక బీఎస్పీ కూడా చిత్తు అయ్యింది!

మరింత సమాచారం తెలుసుకోండి: