రాజప్ప బంధువునని, ఉద్యోగాలు.. పదవులు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి ఒక మోసగాడు లక్షల్లో దోచుకున్నాడు. బండారం బయటపడటంతో ఈ విషయమై నిలదీసిన బాధితుల్ని హాకీ స్టిక్కుతో ఇష్టమొచ్చినట్టుగా చితకబాదాడు. విషయం పోలీసుల దృష్టికి రాగా విచారించి ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ నిందితుణ్ణి విడిచిపెట్టేశారు. ఓవైపు హోం మంత్రి పేరు చెప్పుకుని ఈ దురాగతాలకు పాల్పడటం, మరోవైపు పోలీసులు అతన్ని అరెస్టు చేసిన కొద్దిసేపటికే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది.

దీనిపై టీవీ చానెళ్లలోనూ కథనాలు ప్రసారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజమండ్రి ఎ.వి.అప్పారావు రోడ్డుకు చెందిన ఎ.అవినాష్ అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ అంటూ, తనది కేబినెట్ హోదా అని చెప్పుకుని పలువుర్ని నమ్మించాడు. పెద్ద కారు, ప్రైవేటుగా గన్‌మెన్‌లను నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడు.

అప్పారావు రోడ్‌లో మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని కూడా తెరిచాడు. ఖరీదైన కారు, ఆ కారుకు ఎర్రబుగ్గ, ఆ కారుపై ‘అవినాష్ ఛైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్‌రైట్స్ అని పెద్ద పెద్ద అక్షరాలతో నేమ్‌బోర్డు ఏర్పాటుచేసి తిరుగుతూ ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో వివిధ విద్యాసంస్థలు, ఎన్జీవోల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ మేరకు ఆరోపణలు రావడంతో ఫిబ్రవరి 27న పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజకీయపరమైన ఒత్తిళ్లతో వదిలేశారు.

ఆగడాలు కొనసాగించిన అవినాష్ నిలదీసిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. ఓ దళిత కుటుంబాన్ని కూడా ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. తనను ప్రశ్నిస్తే మీకూ ఇదే గతి పడుతుందని పలువురి బాధితులకు ఆ వీడియో పంపి హెచ్చరించాడు. బాధితుల్లో ఒకరు సదరు వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అవినాష్ ఆగడాలు బయటకు పొక్కినట్లు కూడా కథనం ప్రచారంలో ఉంది. ఇవే వీడియో క్లిప్లింగులను పలు టీవీ చానె ళ్లు సోమవారం రోజంతా ప్రసారం చేశాయి. అవినాష్‌పై కాకినాడకు చెందిన ఒక మహిళ సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన హోంమంత్రి చినరాజప్ప ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పేర్కొంటూ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: