లోక్ సభలో భారతీయ జనతా పార్టీ మోస్ట్ పవర్ ఫుల్.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో భారతీయ జనతా పార్టీ వాళ్లకు తిరుగులేని బలం లభించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత శక్తి వచ్చింది. అయినా ఎన్డీయే రూపంలో మరి కొన్ని పార్టీలను కలుపుకొన్నారు. ఇక ఎన్డీయే బయట ఉన్న పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకే తమ మద్దతు అని అంటున్నాయి.

మరి దిగువ సభ సంగతలా ఉంటే.. ఎగువ సభలో మాత్రం మోడీ ప్రభుత్వం మ్యావ్ అంటోంది. లోక్ సభలో గర్జిస్తున్న ఈ పార్టీ.. రాజ్యసభకు వచ్చే మాత్రం దిక్కుతోచని స్థితిలో పడిపోతోంది. తమ బలాన్ని చాటుకొనే అవకాశం లేక బేలగా మారింది! దీంతో కీలక బిల్లులను పాస్ చేయించుకోలేకపోతున్న బీజేపీ.. ప్రతిపక్ష చేతిలో చిత్తు అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భూ సేకరణ చట్టంలో సవరణల బిల్లులను మోడీ సర్కారు ఆమోదించుకోలేకపోవడం ఖాయమైంది. !

ప్రస్తుతానికి బలాబాలను చూస్తే.. భారతీయ జనతా పార్టీ బేల తనం బయటపడుతుంది. ప్రస్తుతానికి 241 మంది సభ్యులు ఉండగా.. ఎన్డీయే ఈ కూటమికి అనుకూలంగా ఉన్న అన్నాడీఎంకే, తెలంగాణ రాష్ట్ర సమితిలను కలుపుకొన్నా.. మోడీ సర్కారు బలం కేవలం 71 మాత్రమే. ఇదే సమయంలో యూపీఏ ఖాతాలో ఏకంగా 76 మంది ఎంపీలు ఉండటం విశేషం!

కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ బలం 76 కాగా.. ఎన్డీయేను వ్యతిరేకించే సమాజ్ వాదీ పార్టీ. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, కమ్యూనిస్టుపార్టీల బలాన్ని కలుపుకొంటే.. మరో 80 మంది ఎంపీలున్నారు. వీరంతా హోల్ సేల్ గా మోడీ సర్కారు తీరును వ్యతిరేకించే వాళ్లే! దీంతో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బేలగా మిగులుతోంది! ఇప్పుడు వివిధ బిల్లులను గట్టెక్కించుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల.. భారతీయ జనతా పార్టీ వాళ్లు ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు కూడా వ్యూహాత్మకంగా.. భూ సేకరణ చట్టం సవరణల బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మరి మొత్తానికి అన్నీ ఉన్నా మోడీ సర్కారుకు రాజ్యసభలో బలం లేక.. ఇబ్బందులు తప్పడం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: