టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. కరీంనగర్ వేదికగా రెండు రోజుల పాటు సాగిన టీఆర్ఎస్ మేధోమథనం సదస్సు ముగిశాక కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో ఎవరితో పొత్తులుండవని కేసీఆర్ స్పష్టంచేశారు. 100 అసెంబ్లీ సీట్లు, 15 ఎంపీ సీట్లలో తమను గెలిపిస్తే తెలంగాణను ఎవరూ ఆపలేనన్నారు. అంటే 2014 వరకూ తెలంగాణ రాదని కేసీఆర్ ఇన్ డైరెక్ట్ గా చెప్పారా.. కేసీఆర్ వ్యాఖ్యలతో మరో ఏడాదిన్నర వరకూ తెలంగాణ రాదని స్పష్టమవుతోంది. అందుకే 2014 లక్ష్యంగా ఆపార్టీ కార్యాచరణ రూపొందించింది. పార్టీలన్నింటినీ వదిలి సింగిల్ గా పోటీ చేస్తానని ప్రకటించడం వెనుక కూడా ఇదే లక్ష్యం కనిపిస్తోంది. ఇక ఒంటరిగా బరిలోకి దిగితే వచ్చే సమస్యల్ని బేరీజు వేసుకునే జేఏసీతో దోస్తీకి సిద్ధమయ్యారు. పనిలో పనిగా నిన్నమొన్నటివరకూ అటకెక్కించిన తెలంగాణ ఉద్యమానికి బూజు దులిపి ఫ్రెష్ గా జనంలో కెళ్తానంటున్నారు గులాబీ బాస్. ఉద్యమాన్ని పక్కనపెట్టడానికీ కేసీఆర్ కారణాలు చెప్పుకొచ్చారు. కేంద్రం స్వయంగా కోరడం వల్లే ఉద్యమవేడిని తగ్గించామన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోగలిగే వాతావరణ కల్పించామని తెలిపారు. కేంద్రం పిలుపుమేరకే ఢిల్లీ వెళ్లాననీ, తెలంగాణ కోసం పార్టీ విలీనానికీ సిద్ధమయ్యాననీ, కానీ కాంగ్రెస్ ఎప్పటిలానే దగా చేసిందని నేరం మొత్తం హస్తంపైకి నెట్టేశారు. ఇక రేపట్నించి తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కిస్తానన్న టీఆర్ఎస్ అధినేత దీనికి సంబంధించిన షెడ్యూల్ నూ రిలీజ్ చేశారు. నరసింహావతారం ఎత్తనున్నానని ప్రకటించారు. నిన్నటివరకూ స్తబ్దుగా ఉన్న టీఆర్ఎస్ భవన్ లో సందడివాతావరణం కనిపించబోతుందన్నారు. అంటే మరో నెలరోజుల వరకూ రాష్ట్రంలో తెలంగాణ వేడి రోజుకోనుందా.. నిన్నటివరకూ ఉద్యమాన్ని పక్కనపెట్టి ఢిల్లీలో లాబీయింగ్ చేసొచ్చిన గులాబీబాస్ తో నడిచేందుకు తెలంగాణవాదులు సిద్ధమవుతారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే వేచిచూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: