తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త శక్తిని ఇస్తానని అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పొన్నాల చేతిలోని పగ్గాలను స్వీకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తానని అంటున్నాడు. పార్టీకి తిరిగిఅధికారం దక్కేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అయితే ఈ విషయంలో ఉత్తమ్ కు సొంత పార్టీ నేతల నుంచే సహకారం లభించడం లేదు.

తాము ఉత్తమ్ కు సహకరించేదే లేదని.. ఇప్పటికే కోమటిరెడ్డి వంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో పొన్నాల పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం ఇప్పుడు కూడా కొనసాగుతుందని స్పష్టం అవుతోంది. మరి సొంత పార్టీ నుంచి ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఉత్తమ్ కు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా కొత్త ముప్పు ముంచుకొస్తున్నట్టుగా తెలుస్తోంది.

గత ప్రభుత్వం హయాంలో గృహనిర్మాణ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డిసైడ్ చేశారట. మరి ఈ విచారణకూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధం ఉందిక్కడ! ఎందుకంటే.. కిరణ్ హయాంలో ఉత్తమ్ గృహనిర్మాణ శాఖ బాధ్యతలే చూశాడు. దీంతో ఈ అంశంపై విచారణ జరిగితే ఉత్తమ్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ఈ దెబ్బతో కొత్త పీసీసీ అధ్యక్షుడిని నైతికంగా దెబ్బతీసినట్టు అవుతుందని.. కాంగ్రెస్ పార్టీ తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ చేయడానికీ అవకాశం లేకుండా చేసినట్టు అవుతుందని కేసీఆర్ లెక్కలేసుకొంటున్నారట! ఈ మేరకు పక్క ప్రణాళికతో కేసీఆర్ వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీన్ని ఉత్తమ్ ఎలా ఎదుర్కొంటాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: