రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ భావి ఆశాకిరణం. సామాన్య కార్యకర్త నుంచి ప్రధాని వరకు రాహుల్ ను పెద్ద పదవిలో చూడాలని కోరుకునే వారే. అయితే దేశానికి ముగ్గురు ప్రధానులను, సోనియా లాంటి శక్తివంతమైన నాయకురాలిని అందించిన నెహ్రూ కుటుంబంలో వారి అంతటి స్థాయిని రాహుల్ అందుకోగలడా. పదవులు కాళ్ల వద్దకు వస్తున్నా....అసలు రాహుల్ వాటిని ఎందుకు కాదనుకుంటున్నాడు. తన సమర్ధత మీద ఇంకా రాహుల్ కే నమ్మకం లేదా.. దేశంలోని మీడియా సంస్థలే కాకుండా... రాహుల్ కార్యాచరణపై ఇప్పుడు విదేశీ మీడియా కూడా దృష్టి సారించింది. కాంగ్రెస్ లో అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎంతటి శక్తివంతమైన నాయకురాలో.. దాదాపు అంతే హోదా కల్గిన వ్యక్తి యువనేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్త నుంచి ఆ పార్టీ తరపున ఎంతటి పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి అయినా రాహుల్ చూపు పడితే చాలు అనుకునే స్థాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు రాహుల్ ఆశాకిరణం. కాంగ్రెస్ లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఉన్న రాహుల్ ప్రతి కదలికపైనా ఇప్పుడు విదేశీ మీడియా దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న భారత్ కు కాబోయే ప్రధానిగా భావిస్తున్న రాహుల్ పోషించబోయే, పోషించే పాత్ర మీద ఓ నజర్ వేసి ఉంచింది. రాహుల్ అడిగితే ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ లో సంకోచించని నేత ఉండడు. అంతే కాదు మంత్రివర్గంలో చేరాలని ప్రధాని నోరు విడిచి అడిగినా రాహుల్ దానికి నో చెప్పేసాడు. పార్టీ అభివృద్ధే తనకు ముఖ్యమంటూ తన మనసులో మాట చెప్పేసాడు. ప్రస్తుత లక్ష్యం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను మళ్లీ విజయ తీరాలకు చేర్చడమే అంటూ పార్టీ సేవకు సిద్ధం అయిపోయాడు. నేడో రేపో రాహుల్ కు పార్టీలో కీలక పదవి ఖాయం. మళ్లీ పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవి చేపట్టేది రాహులే. ఆయన కూడా అందుకు తగ్గట్లుగానే సమాయత్తం అవుతున్నానని అంటున్నాడు. అయితే ఆ సత్తా రాహుల్ లో ఉందా అంటూ విదేశీ మీడియా ఆరాలు తీస్తోంది. రాహుల్ ప్రచారం చేసిన ఉత్తరప్రదేశ్, బీహార్ లలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ లో అయితే రాహుల్ ఒక్కసారి కూడా ప్రచారానికి వెళ్లలేదు. ఇక రాహుల్ చేసే ప్రసంగాలు సామాన్య జనాన్ని ఆకట్టుకుంటున్నా... ఒక్కోసారి పరిణితి లేనివిగా ఉంటున్నాయని విదేశీ మీడియా భావిస్తోంది. వందకోట్ల జనాభా ఉన్న భారత దేశాన్ని పాలించే సత్తా రాహుల్ లో ఉందని ఓ కంట కనిపెడుతూ ఉంది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి గొప్ప ప్రధానులను అందించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ. కంటి చూపుతో ప్రభుత్వాలను శాసిస్తున్న తల్లి సోనియాగాంధీ. ఇలాంటి కుటుంబానికి చెందిన రాహుల్ భావి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సత్తా ఉందా, ఒక వేళ చేపడితే ఏమేరకు రాణిస్తారు. ప్రభుత్వాన్నైనా, పార్టీనైనా ఇందిర, రాజీవ్, సోనియాల్లో నడిపిస్తారా. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతారా. అసలు రాహుల్ భావికార్యాచరణ ఏమిటి. ప్రపంచంలోని అతి పెద్ద దేశాల్లో ఒకటైనా భారత్ వ్యవహారాలను గమనించే విదేశీ మీడియాకు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: