నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతలపై చర్చకు సమయం కేటాయించే విషయంపై సోమవారం శాసనసభ అట్టుడికింది. సమస్య తీవ్రత దృష్ట్యా తమకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలా కుదరదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు భీష్మించడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షం అభ్యంతరాలను సమగ్రంగా ఆలకించాలని వైఎస్సార్ సీపీ చేసిన విజ్ఞప్తిని స్పీకర్ తోసిపుచ్చడంతో సభ నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడబోయే ప్రతిసారీ మంత్రులు అడ్డుపడి మైకు తీసుకోవడం, పాలకపక్షం విమర్శలు, ప్రతిపక్షం నినాదాలు, వాగ్యుద్దాల కారణంగా ఆ సమయంలో సభ వాయిదా పడింది.

వివాదం ఇలా మొదలైంది... ఉదయం టీ విరామం అనంతరం 11.25 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్.. సభ నియమావళిలోని 344వ నిబంధన కింద నదుల అనుసంధానంపై చర్చను ప్రారంభించాల్సిందిగా టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రను కోరారు. దీనికి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. టీడీపీ కన్నా ముందు తాము చర్చకు నోటీసు ఇచ్చినప్పటికీ తెలుగుదేశం వారిని ఎలా అనుమతించారని, ముందు మాట్లాడే అవకాశం తమకు ఇవ్వాలని కోరారు. దీనికి స్పీకర్ బదులిస్తూ విపక్షం కన్నా ముందే తెలుగుదేశం నోటీస్ ఇచ్చిందన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏమిటో చెప్పాలన్నారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, డెల్టాలో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన విషయమని, దీనిపై తమ పార్టీ తరఫున మాట్లాడేందుకు ముగ్గురికి అవకాశం ఇవ్వాలని, మధ్యమధ్యలో తానుకూడా మాట్లాడతానని చెప్పారు. కనీసం రెండు గంటల సమయమైనా ఇవ్వాలన్న ప్రతిపక్ష విజ్ఞప్తిని స్పీకర్ కోడెల తోసిపుచ్చారు. ఎంత అవకాశం ఉంటే అంత ఇస్తామని, అయితే అదంతా చట్ట ప్రకారమే ఉంటుందన్నారు.

ముఖ్యమైన సమస్యపై మాట్లాడేందుకు సమయం కేటాయించకపోతే ఎలా అని జగన్ ప్రశ్నిస్తుండగానే మైక్ కట్ అయింది. ఈ సమయంలో సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుంటూ ప్రతిపక్ష నేతపై విరుచుకుపడ్డారు. మీరు యాక్షన్ (నటన) చేస్తానంటే కుదరదని వ్యాఖ్యానించారు. దీనికి విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కీలకమైన చర్చల్లో ప్రతిపక్షానికి అదనపు సమయం కావాలని చెబుతూ వచ్చామని, అయినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమం వల్ల 15 లక్షల ఎకరాల డెల్టా భూమి దెబ్బతింటుందని, ఇంత కీలకమైన అంశంపై సమగ్రంగా చర్చించాలంటే అధిక సమయం అవసరమన్నారు. ఈ దశలో మళ్లీ యనమలకు ప్రతిపక్ష సభ్యులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి.

అతి ముఖ్యమనే ఎజెండాలో చేర్చాం... అతి ముఖ్యమైన సమస్య అయినందునే తాము ప్రతిపక్షం నోటీసును కూడా ఎజెండాలో చేర్చామని, కానీ వాళ్లు చర్చకు రాకుండా పారిపోయే ధోరణిలో వ్యవహరిస్తున్నారని యనమల ఆరోపించారు. అప్పుడు స్పీకర్ జోక్యం చేసుకుంటూ 344 నిబంధన కింద అరగంట నుంచి గంట లోపు చర్చించవచ్చని, ఇందులో అధికార పక్షానికి 20, ప్రతిపక్షానికి 20, సంబంధిత మంత్రి వివరణకు 20 నిమిషాల వ్యవధి ఇస్తారని వివరించారు. దీనికి జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘మా నుంచి తీర్మానం వచ్చినా వాళ్లనే అనుమతించారు. ప్రతిపక్షం ఏమి చెబుతుందో వినండి. ఏమి చెప్పినా రాష్ట్రం బాగుకే కదా! వినే ఓపిక ఉండాలి. విపక్షం చెప్పేది వినాలి’’ అని జగన్ అన్నారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. సవివరంగా మాట్లాడాలనుకుంటే బడ్జెట్‌పై చర్చలోనో, ఇతర పద్దులపై చర్చలోనో మాట్లాడవచ్చన్నారు. అయితే దీనికి జగన్ అంగీకరించలేదు. ‘‘మీ ఇష్టం వచ్చినట్టు టెండర్ మొత్తాన్ని 22 శాతానికి పెంచుకుంటూ మీకు నచ్చిన వారికి కట్టబెడతారా? ఏం జరుగుతుందనేది ప్రజలు చూస్తున్నారు. అరగంట ఇస్తామంటే సహించం. ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? అవసరమైతే సభను అడ్డుకుంటాం’’ అని ప్రతిపక్ష నేత నిప్పులు చెరిగారు. ఈ దశలో పాలకపక్షం, ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు జరిగాయి. సమస్యను పక్కదోవపట్టించేందుకు యనమల తదితరులు ప్రయత్నిస్తుండడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులందరూ సభ మధ్యలోకి చేరి నినాదాల హోరెత్తించారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి పట్టిసీమపై సుదీర్ఘచర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, యనమల, బొజ్జల, పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య తదితరులు ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. విపక్ష నేతపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. విపక్ష సభ్యులను రెచ్చగొట్టేలా విపరీత వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పొట్టగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, పట్టిసీమ పూర్తయితే రాయలసీమలో పుట్టగతులుండవని భయపడుతున్నారని, ‘సాక్షి’ ఎజెండానే అసెంబ్లీ ఎజెండాగా మార్చాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ దశలో విపక్ష సభ్యులు మరింతలా నినాదాలు చేయడంతో స్పీకర్ కోడెల సభను వాయిదా వేశారు. సభ తిరిగి 12.57 గంటలకు ప్రారంభమయ్యాక కూడా కొద్దిసేపు గందరగోళం కొనసాగింది. చీఫ్ విప్ చీప్‌గా మాట్లాడుతున్నారు: జ్యోతుల ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. సభను సమన్వయంతో నడపాల్సిన చీఫ్ విప్ చాలా చీప్‌గా మాట్లాడడం బాగాలేదన్నారు. సభ సజావుగా నడిచేందుకు విపక్షాన్ని కలుపుకొని పోవాల్సిన వ్యక్తి ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. దీనికి కాల్వ శ్రీనివాసులు అభ్యంతరం చెబుతూ.. చీప్ పదాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పక్కదోవ పట్టించే యత్నం.. ప్రతిపక్ష వాణి వినిపించకుండా చేయాలన్నదే లక్ష్యంగా అధికార పక్షం విపక్ష నేతపై విరుచుకుపడింది. సోమవారం జరిగిన తీరంతా ఆ తీరునే తలపించింది. జగన్‌మోహన్‌రెడ్డి చర్చకు మరింత సమయం కావాలని కోరితే అసలు రాయలసీమకే నీళ్లు వద్దన్నట్టు, నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అర్థం వచ్చేలా సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. యనమలతో మొదలైన ఈ పరంపర కాల్వ శ్రీనివాసులు దాకా కొనసాగింది. సభలో నిరసన సాగుతున్న సమయంలో మాట్లాడిన ప్రతి టీటీడీ సభ్యుడూ విపక్షనేతపై నిందాపూర్వక దాడినే కొనసాగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: