ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలతో తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ను పెంచుకోవాల్సింది పోయి తీవ్రమైన డ్యామేజీని కలిగించుకొందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చా.. తాము ఎంత ప్రగతి సాధిస్తున్నామో చెప్పాల్సిన తెలుగుదేశం వాళ్లు.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేస్తూ చెడ్డపేరు తెచ్చుకొంటున్నారు. ఎదురుదాడిలో కూడా తెలుగుదేశం నేతలు మరీ అసహనాన్ని కనబరుస్తుండటంతో టీడీపీకి ఎదురుదెబ్బ పడుతోంది!

ఈ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు.. ప్రస్తావించిన అంశాలకు సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. వైకాపా వాళ్లు ఏ అంశాన్ని లేవనెత్తినా.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎదురుదాడి చేశారు. జగన్ అవినీతి అన్నారు.. లక్ష కోట్లన్నారు. అచ్చం ఎన్నికల ప్రచార సభల్లో ఎలా మాట్లాడారో తెలుగుదేశం నేతలు అసెంబ్లీలో కూడా అదే తీరున వ్యవహరించారు.

తెలుగుదేశం పార్టీ నుంచి జనాలు కోరుకొంటున్నదైతే ఇది కాదు! బాబును అభివృద్ధి ప్రధాత అన్నారు.. ఆయనకు అధికారం అప్పజెప్పితే అద్భుతాలు జరుగుతాయని చెప్పుకొన్నారు. అయితే జగన్ వంటి అనుభవ రహిత ప్రతిపక్ష నేతకు కూడా తెలుగుదేశం సమాధానం చెప్పలేకపోతోంది! ఎదురుదాడి అస్త్రం తప్ప సూటిగా సమాధానం చెప్పే సత్తువ తెలుగుదేశం లో కనపడటం లేదు.

ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసహనానికి లోనయ్యాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముప్పై యేళ్ల అనుభవజ్ఞుడిని అని చెప్పుకొనే బాబు ఇలాంటి అసహనాన్ని కనబరచడం.. ప్రతిపక్ష సభ్యులపై నోరు పారేసుకోవడం తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యానికి సాక్షాలు. మరి టీడీపీ ఈ తీరును మార్చుకొంటే.. మంచిది. లేకపోతే ఆశలుపెట్టుకొని గెలిపించిన వారిని అవమానించినట్టే!

మరింత సమాచారం తెలుసుకోండి: