ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ చేరిన ఒకే ఒక్క చిన్న జట్టు బంగ్లాదేశ్. అందుకే ఆ జట్టుతో క్వార్టర్ ఫైనల్ అనగానే భారత అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం. మిగతా జట్లన్నింటికీ కష్టమైన ప్రత్యర్థి పడిందని.. మనకు మాత్రం పసికూన ఎదురవుతోందని సంబరపడిపోయారు. టీమ్ఇండియా సెమీఫైనల్ చేరడం లాంఛనమే అనుకున్నారు.

కానీ బంగ్లాదేశ్ మన క్వార్టర్స్ ప్రత్యర్థి అని ఖరారైన రోజు నుంచి లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ హెచ్చరిస్తూనే ఉన్నారు.. వాళ్లను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే.. బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే ధోనీసేన తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లే అని. ఆయన అంత ఆందోళన ఎందుకు వ్యక్తం చేశారో.. ఇప్పుడు తెలుస్తోంది.

గురువారం ఉదయం టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోగానే భారీ స్కోరు ఖాయమనుకున్నారు. లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై ఇదే మైదానంలో (మెల్‌బోర్న్) జరిగిన మ్యాచ్‌లో భారత్ 307 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్, రోహిత్ పది ఓవర్లకు 51 పరుగులు చేసి.. వికెట్ కోల్పోకుండా నిలిచేసరికి భారత్‌‌కు ఈసారి కూడా తిరుగులేదని అనుకున్నారు. మంచి పునాది పడింది కాబట్టి ఇక 300 చేయడం పెద్ద విషయం కాదని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు కథ.

ధావన్ 30 పరుగుల వద్ద స్టంపౌట్. స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లి 3 పరుగులకే ఔట్. నిలకడగా ఆడే రహానె కూడా 19 పరుగులకు ఔట్. ఫలితంగా 115 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత్. 29 ఓవర్లకు భారత్ స్కోరు 120 పరుగులే. రన్ రేట్ 4కు కాస్త ఎక్కువగా ఉంది. ఈ లెక్కన భారత్ స్కోరు 250 చేరుకుంటే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. చివరి ఓవర్లలో పుంజుకుని భారీగా పరుగులు రాబట్టకుంటే భారత్‌కు పెద్ద షాక్ తగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: