ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఈ విషయం గురువారంనాటి అసెంబ్లీలో సుస్పష్టంగా కనిపించింది. అధికార పక్షం తప్పు ఏమీ లేకుండానే ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టడమే కాకుండా ప్రతిపక్షం మాట్లాడకుండా చేయడంలో స్పీకర్‌, అధికారపక్షం కలిసి పావులు కదుపుతున్నారని కూడా స్పష్టమైంది.

బడ్జెట్‌పై చర్చలో భాగంగా జగన్‌ మాట్లాడుతున్నారు. సాగదీస్తూ.. చెప్పిన మాటనే చెబుతూ.. మాట్లాడినా ఆయన సబ్జక్టునే మాట్లాడుతున్నారు. సబ్జక్టు నుంచి పక్కకుపోలేదు. ఇక, బడ్జెట్‌ను పెంచి చూపించారని తొలుత చెప్పిన ఆయన ఆ తర్వాత రుణ మాఫీ దగ్గరకు వచ్చారు. రుణ మాఫీ అంశంపై ఆయన మాట్లాడితే అధికార పక్షం ఇరుకున పడుతుంది. రుణ మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారని అన్న వెంటనే స్పీకర్‌ బెల్లు మోగించారు. ముగించాలని చెప్పారు.

వాస్తవానికి బడ్జెట్‌ ప్రసంగంలో సభా నాయకుడి తర్వాతి స్థానం ప్రతిపక్ష నాయకుడిదే. ఆయనకు అంత ప్రాధాన్యం కూడా ఇవ్వాలి. కానీ, జగన్‌ మాట్లాడకుండా చేయాలని టీడీపీ కంకణం కట్టుకున్నట్లు వ్యవహరించిందని గురువారంనాటి ఎపిసోడ్‌తో స్పష్టమైంది. అలాగే 'ఐ విల్‌ స్పీక్‌' అని జగన్‌ అనడం కూడా తప్పు కాదు. అయితే, ఇతరులు జోక్యం చేసుకున్నప్పుడు ఐయామ్‌ నాట్‌ ఈల్డింగ్‌ అధ్యక్షా అని అంటారు. శాసనసభ పరిభాషలో అనకపోవచ్చు కానీ ఆయన అన్నది నేరం అయితే కాదు. అటువంటి సమయంలో యు విల్‌ నాట్‌ స్పీక్‌ అంటూ స్పీకర్‌ అనడం మాత్రం కచ్చితంగా తప్పే.

అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిన స్పీకర్‌ అలా అనడం సరికాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంమీద గురువారంనాటి శాసనసభలో స్పీకర్‌ వివాదాస్పదంగా మారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .

మరింత సమాచారం తెలుసుకోండి: