ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ తీరు రోజు రోజుకూ విమర్శలకు కారణం అవుతోంది. ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ తన రాజకీయాలకు వాడుకొంటోందనే అభిప్రాయాలు వినిపిస్తోంది. ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ వాడుకొంటోంది. అంతేగానీ.. ఏపీ ప్రయోజనాల విషయంలో భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ది ఏమీ కనపడటం లేదు.

ఏపీకి ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీ తీరు వల్లనే గందరగోళంలో పడిపోయిందని.. కాంగ్రెస్ పార్టీ డబుల్ టోన్ వినిపిస్తోందని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కే చెందిన వెంకయ్యనాయుడు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తుతున్నాడు.

కాంగ్రెస్ విమర్శల సంగతెలా ఉన్నా.. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రత్యేక హోదా అంశం గురించి.. ఏపీ రాజధాని అంశం గురించి భారతీయ జనతా పార్టీనే జవాబుదారీగా ఉండాలి. అయితే బీజేపీ ఈ విషయంలో బాధ్యత తీసుకోవడం లేదు. ఎంతసేపూ ఈ అంశం చర్చకు వచ్చిందంటే.. కాంగ్రెస్ పై విమర్శలు చేయడం.. ఏపీ విభజన బిల్లుపై విమర్శలు చేయడం తప్ప.. కమలనాథులు చేస్తున్నదేం లేదు!

కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని చెప్పడం భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. అయితే కాంగ్రెస్ పార్టీ కథ ఇప్పటికే అయిపోయింది. చేసిన అన్యాయానికి ప్రజలు కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకొన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సి ఉంది. అలాగాక కమలనాథులు ఇలా కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ పొద్దుపుచ్చితే మాత్రం వీళ్లకూ కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: