nobody dies virgin cause in the end life fucks us all.. అంటారు. జీవితంలో ఎవరూ మినహాయింపుకాదన్న తత్వం ఉంది కొంచెం ఘాటుగా ఉంది ఈ కొటేషన్ లో. మరి ఎదురుదెబ్బలు తప్పని ఈ జీవితంలో మనసుకు నచ్చినట్టుగా బతకడం అంటే అది సినిమాల్లో హీరోలకు మాత్రమే సాధ్యమవుతుంది. నిజ జీవితంలో ఎంత డబ్బున్నా.. ఎన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న నచ్చినట్టుగా బతకడం మాత్రం అత్యంత కష్టం. ఏమీ లోటు లేని వాళ్లు కూడా ఎన్నో విషయాల్లో రాజీ పడిపోవాల్సిందే.

అయితే ఇలాంటి రాజీలకు కూడా కొంతమంది మినహాయింపులుంటారు. అత్యుత్తమ అవకాశాల విషయంలో కూడా వారు రాజీ పడరు! జీవితం వారికి మినహాయింపునిస్తుంది. రాజీ పడకుండా బతకడానికి అవకాశం ఇస్తుంది. అలాంటి వారిలో ఒకరు కపిల్ సిబల్. మొన్నటి వరకూ కేంద్రమంత్రిగా ఉండిన ఈ కాంగ్రెస్ నేతకు జీవనశైలిని గమనిస్తే ఆ మినహాయిపులేంటో అర్థం అవుతాయి. కపిల్ సిబల్.. మొన్నటి ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీచౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మరి ఓటమి మనిషికి ఎదురుదెబ్బే కానీ కపిల్ ఆ ఓటమిని చాలా లైట్ తీసుకొన్నాడు. ఎందుకంటే ఈ మనిషి జీవితంలో సక్సెస్ నే లైట్ తీసుకొన్నాడు. ఒక ఫెయిల్యూర్ ను పట్టించుకోకుండా ఉండగలగడం పెద్ద కష్టం కాదు కదా! తన పాతికేళ్ల వయసులో కపిల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు ఎంపిక అయ్యాడు. దేశంలోని కొన్ని కోట్ల మంది యువతీయువకుల కలల పంట అది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను క్లియర్ చేసి ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాడు! ఒక ఇండియన్ యువకుడికి అంతకు మించిన విజయం దాదాపుగా ఉండదు! సామాన్యకుటుంబంలో పుట్టిన యువకుడికైనా.. అసామాన్య కుటుంబంలో పుట్టిన వాడికైనా సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం రావడమంటే అదొక వరమే.

సిబల్ మాత్రం ఆ వరాన్ని పట్టించుకోలేదు. సివిల్స్ కు ఎంపిక అయ్యి.. దాన్ని వదిలేసుకొన్నాడు. ఎందుకంటే.. తనకు ఇష్టం లేదంతే! లా చదవాలి.. లాయర్ గా ఎదగాలనుకొన్నాడు. కోరి వచ్చిన సివిల్స్ ను వదిలేసుకొని హార్వర్డ్ వెళ్లాడు. లా చదివాడు. మరి అవకాశం ఒక్కసారే తలుపుతడుతుంది.. అప్పుడు టక్కున తలుపు తెరవాలని అంటారు. అయితే సిబల్ కు మాత్రం ఆయన తలుపు తెరిచే వరకూ రకరకాల అవకాశాలు తడుతూనే ఉన్నట్టున్నాయి. లా చదవొచ్చాకా లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అతి తక్కువ సమయంలోనే సొలిసిటరీ జనరల్ స్థాయికి చేరాడు! ఐఏఎస్ అయ్యుంటే చాలా మందికి సమాధానాలు చెప్పాలి. సొలిసటరీ జనరల్ స్థాయికి చేరితే ఎవ్వరితోనైనా వాదించవచ్చు! మరి ఇలాంటి సక్సెస్ ల గురించి వింటుంటూనే మజాగా ఉంటుంది. వాటిని అనుభవించిన మనిషి ఇంకెంత కిక్ ఉంటుందో!

ఇక విలాసాల విషయంలో కూడా సిబల్ వెనక్కు తగ్గలేదు. ఎన్నికలు అయిపోయాకా కేంద్ర మంత్రిగా ఉండిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి అద్దె ఇంటికి మారాడాయన. ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ టూంబ్ పరిసరాల్లో ఒక ఇంటిని తీసుకొన్నాడు. దాని అద్దె నెలకు అక్షరాల పదహారు లక్షలు. ఏడాదికి దాదాపు రెండు కోట్లు. ఒక రాజకీయ నేతగా అంత అద్దె కడితే జనాల్లో కూడా చెడ్డపేరువస్తుందనే సంకోచాలేమీ లేవు. సిబల్ తగ్గలేదు. కాంగ్రెస్ నేత ఏడాదికి రెండు కోట్ల రూపాయలు అద్దె కడుతున్నాడని జాతీయ స్థాయి పత్రికలు పతాకశీర్షికలో ప్రచురిస్తూ బుగ్గలు నొక్కుకొన్నాయి. జీవితంలో మజా తెలిసిన వారు మాత్రం కపిల్ లైఫ్ స్టైల్ ను చూసి "అది రా బతుకంటే..' అన్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: