వన్డే క్రికెట్లో మరో డబుల్ సెంచరీ నమోదైంది. ఎవరూ ఊహించని విధంగా న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇంతకుముందు వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించే సత్తా ఎవరికుందంటూ సర్వే ఏదైనా చేసి ఉంటే కచ్చితంగా అందులో మార్టిన్ గప్తిల్ పేరు ఉండేది కాదు. ఎందుకంటే అతను ఇప్పటిదాకా డబుల్ సెంచరీ సాధించిన వీరుల స్థాయిలో విధ్వంసక ఆటగాడు కాదు. అందుకే గప్తిల్ డబుల్ సెంచరీ చేశాడనగానే చాలామంది ఆశ్చర్యపోయారు.

ప్తిల్ సాధించిందాంతో కలిపితే వన్డేల్లో ఆరు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో నాలుగు భారత ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. సచిన్ తొలి డబుల్ సెంచరీ (200 నాటౌట్) సాధించగా.. తర్వాత సెహ్వాగ్ వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ కొట్టాడు. ఆపై రోహిత్ శర్మ రెండు డబుల్ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌ లీగ్ దశలో జింబాబ్వేపై 215 పరుగులు చేసిన గేల్.. డబుల్ సెంచరీ చేసిన తొలి భారతేతర ఆటగాడయ్యాడు. ఇప్పుడు గప్తిల్ కూడా ఆ జాబితాలో చేరాడు.

ఈ డబుల్ సెంచరీల్లో ఏది గొప్పది అనే చర్చ రావడం సహజం. భారత ఆటగాళ్లు చేసిన డబుల్ సెంచరీలన్నీ సొంతగడ్డపై చేసినవే. మన వికెట్లు బ్యాటింగ్‌కు అనుకూలమని.. అందుకే డబుల్ సెంచరీ చేయగలిగారని అనొచ్చు. ఐతే ప్రస్తుతం ప్రపంచకప్‌లోని వికెట్లన్నీ కూడా బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వికెట్ల విషయంలో తేడాలేం చూడక్కర్లేదు. ఎవరిది బలమైన బౌలింగ్ అనే చూడాలి.

గప్తిల్ డబుల్ సెంచరీ చేసిన మైదానం చాలా చిన్నది. వెస్టిండీస్ బౌలింగ్ కూడా బలహీనమే. గేల్ 200 చేసింది కూడా జింబాబ్వే జట్టుపై కాబట్టి దాన్ని కూడా లెక్కలోంచి తీసేయొచ్చు. సెహ్వాగ్ కూడా బలహీన వెస్టిండీస్ జట్టుపై డబుల్ సెంచరీ చేశాడు. రోహిత్ 264 పరుగులు చేసిన శ్రీలంక బౌలింగ్ కూడా వీకే. అతడి తొలి సెంచరీ ఆస్ట్రేలియాపై చేశాడు. వాళ్లది మంచి బౌలింగే. ఐతే సచిన్ సాధించిన తొలి డబుల్ సెంచరీ దక్షిణాఫ్రికాపై సాధించింది. స్టెయిన్, మోర్కెల్, ఎన్తిని లాంటి టాప్ బౌలర్లున్నారు ఆ జట్టుకు. పైగా అప్పటిదాకా డబుల్ సెంచరీ నమోదవలేదు. కాబట్టి అన్నింట్లోకి బెస్ట్ డబుల్ సెంచరీ సచిన్‌దే అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: