ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు అవుతున్నా రుణ మాఫీని మాత్రం పూర్తిస్థాయిలో అమలుచేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికి మొదటి విడతలో కొందరు రైతులకు వివిధ నిబంధనలతో మాఫీ వర్తింపజేసిన ప్రభుత్వం సుమారు 10 నెలల తరువాత ఇప్పుడు రెండో విడతగా రూ.2175 కోట్లు కేటాయించింది. మొదటి విడతలో మాఫీ నిమిత్తం రూ.4,664 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ హామీ అమలుకు కింద మీద పడుతోంది. హామీ అమలు చేస్తే నిధుల కొరత, అమలు చేయకపోతే హామీ విస్మరించారన్న విమర్శ ఎదుర్కొనే పరిస్థితి ఉండడంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. 

మరోవైపు రుణాల మాఫీ అరకొరకగానే జరిగిందని రైతులే అంటున్నారు.  మాఫీ వల్ల 20 శాతం మంది రైతులకు కూడా పూర్తిస్థాయిలో లబ్ధి కలగలేదని అంటున్నారు.  మాఫీ కాని రుణాలపై బ్యాంకులు బంగారంపై పంట రుణాలు, వ్యవ సాయ రుణాలను వేలం వేస్తూ చక్రవడ్డీలు వేస్తుండడంతో రైతుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న అడ్డగోలు కోత విధానాలతో 80 వేల కోట్ల రూపాయలు ఉన్న వ్యవసాయ రుణాల మాఫీ 10 వేల కోట్ల రూపాయలు కూడా దాటని పరిస్థితి ఏర్పడింది. మొదటి విడతగా 20 శాతం రుణ మాఫీ చేసినట్లు ప్రకటించినా అది గందరగోళంగా తయారైంది. 

మొదటి, రెండవ విడత మాఫీ జాబితాలను విడుదల చేసిన ప్రభుత్వం వాటిపై అభ్యంతరాలు, అనుమానాల నివృత్తికి ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లు కూడా రైతులకు ఉపయోగం లేకుండా పోయాయి. ఆన్‌లైన్‌ లో ఉంచిన రుణాల జాబితాను చూసుకునేందుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, లోన్‌ నెంబర్‌ వంటి వివరాలను నమోదు చేస్తే 80 శాతం రైతులకు సంబం ధించి ఆధార్‌కార్డు చెల్లుబాటులో లేదనే రిమార్కు పెట్టి వాటిని పెండింగ్‌లో ఉంచిన సంఘటనలే ఉన్నాయి. ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేస్తే సంబంధిత రైతుల వివరాలన్నీ ఉన్నా ఆధార్‌ చెల్లుబాటు కాదని పెండింగ్‌లో పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవిధంగా వ్యవసాయ రుణాలు, వ్యవసాయం నిమిత్తం తీసుకున్న బంగారు రుణాల మాఫీని చంద్రబాబునాయుడి ప్రభుత్వం కావాలని ఎగ్గొట్టేందుకే ప్రయత్నిస్తున్నట్లు రైతులే ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు అందులో సవాలక్ష నిబంధనలతో ఇబ్బందులు పెడుతున్నారంటున్నారు.

తొలి, మలి విడత 50 వేల రూపాయల లోపు వరకూ ఉన్న వ్యవసాయ, బంగారు రుణాలను మాఫీ చేస్తా మని చెప్పిన ప్రభుత్వం అన్ని అర్హత పత్రాలు అందుబాటులో ఉన్నా వాటిని పెండింగ్‌లో పెట్టడం వెనుక ఆంతర్యం ఎగవేతకేననే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఇప్పటికే 2014 మార్చి 31 వరకూ ఉన్న వ్యవసాయ, బంగారు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం దానిపై మాట మార్చి ఈ గడువును కుదించింది. 2013 డిసెంబర్‌ 31వ తేదీ నాటికి తీసుకున్న వ్యవసాయ రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. మరోపక్క వ్యవసాయ రుణాల మాఫీకి ఆధార్‌ కార్డుకు రాష్ట్ర ప్రభుత్వం లింక్‌ పెట్టింది. దానికి తగినట్లుగా తాజాగా స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ను తెరమీదకు తెచ్చి రుణాలకు అంటకత్తెర వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య, సహకార, ప్రైవేటు బ్యాంకులు 2014 మార్చి 31వ తేదీ నాటికి 87 వేల కోట్ల రూపాల మేర రుణాలు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఇందులో 34 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ పంట రుణాలు కాగా, 20 వేల కోట్ల రూపాయల మేర వ్యవసాయం నిమిత్తం తీసుకున్న బంగారు రుణాలు ఉన్నా యి. అంతేకాకుండా డ్వాక్రా గ్రూపుల రుణాలను కూడా ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో బ్యాంకులు ఇచ్చిన 87 వేల కోట్ల రూపాయల రుణాల్లో డ్వాక్రా గ్రూపులకు సంబంధించి 14,204 కోట్ల రూపాయల మేర ఉన్నాయి. కోటయ్య కమిటీ నివేదిక ప్రకారం రుణాలకు సంబంధించి 72 వేల కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేయా ల్సి ఉంటుంది.

అయితే సీఎం చంద్రబాబునాయుడు కోటయ్య కమిటీ నివేది ను పక్కనపెట్టి వ్యవసాయ పంట రుణాలు, వ్యవసాయ భూములపై తీసుకున్న బంగారు రుణాలు, డ్వాక్రా రుణాలు అన్నీ కలిపి మాఫీ చేయాల్సిన మొత్తం 35 వేల కోట్ల రూపాయలుగా తేల్చింది. కుటుంబంలో అన్ని రుణాల మొత్తం 1.50 లక్షల రూపాయల చొప్పున మాఫీ చేయాలని నిర్ణయిం చింది. ఈవిధంగా 87 వేల కోట్ల రూపాయలను మాఫీ చేయాల్సిన చంద్రబా బునాయుడు ప్రభుత్వం అందులో కోత పెట్టి 35 వేల కోట్ల రూపాయలకు తీసుకువచ్చింది. 31 మార్చి 2014 గడువు తేదీని మార్చి 2013 డిసెంబర్‌ 31వ తేదీకి మార్చడంతో అర్హులైన రైతులు పలువురు రుణ మాఫీ అర్హతను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి భారం తగ్గుతుందని అంచనా. దీంతో ఏపీ ప్రభుత్వం రుణ మాఫీని మాఫీ చేసేస్తుందని ..... దొంగదారుల్లో మాఫీ ప్రయోజనాలను రైతులకు వర్తించకుండా తప్పించుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. సవాలక్ష నిబంధనలు విధించి.... మాఫీ పొందడంలో సంక్లిష్ట విధానాలు రూపొందించి రైతులు మాఫీకి దూరమయ్యేలా చేస్తున్నారని... విసిగిపోయిన రైతులు బ్యాంకులకు బకాయిలు చెల్లించేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: