ప్రపంచకప్ ఎవరి దేశంలో జరిగితే ఆ దేశంలో అభిమానులు స్టేడియాల్లో నిండిపోవడం సహజం. ముఖ్యంగా తమ సొంత జట్టు ఆడుతుంటే 90 శాతం సీట్లు ఆ దేశ అభిమానులతోనే నిండిపోతుంటాయి. ఐతే గురువారం ఆస్ట్రేలియా-భారత్ మ్యాచ్‌లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

ప్రపంచంలో భారత జట్టు ఏ దేశానికి వెళ్లి మ్యాచ్ ఆడినా.. అక్కడికి అభిమానులు తరలి వెళ్తారన్నది కొత్త విషయం కాదు. మరే జట్టు కోసం ఇలా అభిమానులు దేశాలు దాటి వెళ్లడం జరగదు. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ దేశాల్లోనే మన జనాలు స్థిర పడి ఉంటారు. మనోళ్లు క్రికెట్ మ్యాచ్ ఆడితే.. ఆఫీసులకు లీవ్ పెట్టేసి మ్యాచ్ చూడటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.

అందుకే భారత జట్టు విదేశాల్లో ఆడుతున్నపుడు కూడా స్టేడియాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలు.. నీలి రంగు చొక్కాల సందడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. మొన్న బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్లో 80 వేలకు పైగా సామర్థ్యం కలిగిన మెల్‌బోర్న్ స్టేడియం నిండిపోయింది. అందులో మెజారిటీ ఫ్యాన్స్ ఇండియన్సే.

ఇక గురువారం రోజు సిడ్నీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఆస్ట్రేలియా అభిమానులు భారీ స్థాయిలో వస్తారనడంలో సందేహం లేదు. ఐతే మొత్తం కంగారూ అభిమానులతో నిండిపోతుందని అనుకోవడానికి లేదు. మూడొంతుల్లో ఓ వంతు అయినా భారత అభిమానులు వస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి అభిమానుల మద్దతు లేదని ధోనీసేన కంగారు పడాల్సిన పని లేదు. సిడ్నీలోని హోటళ్లన్నీ నిండిపోతుండటం.. ఆస్ట్రేలియాకు భారత్ నుంచి ఫ్లైట్ ప్రయాణ టికెట్ల రేట్లు పెరగడాన్ని బట్టి మనోళ్లు భారీగానే మ్యాచ్‌కు హాజరవబోతున్నారని తెలుస్తోంది. చూద్దాం స్టేడియంలో మన అభిమానుల సందడి ఎలా ఉండబోతోందో?


మరింత సమాచారం తెలుసుకోండి: