బలాబలాల ప్రకారం చూస్తే ప్రపంచ క్రికెట్లో దక్షిణాఫ్రికాను మించిన జట్టు మరొకటి ఉండదన్నది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. బ్యాటింగ్‌లో ఆమ్లా, డికాక్, డుప్లెసిస్, డివిలియర్స్, మిల్లర్, డుమిని.. బౌలింగ్‌లో స్టెయిన్, మోర్ని మోర్కెల్, అబాట్, తాహిర్.. ఇలా రెండు విభాగాల్లోనూ దుర్బేధ్యంగా ఉందా జట్టు. ఇక సఫారీల ఫీల్డింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఐతే జట్టు ఎంత బలంగా ఉంటే ఏంటి.. ఆడాల్సిన రోజు అందరూ ఆడితేనే గెలుపు సాధ్యం. భారత్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లు 300కు పైగా పరుగులిచ్చుకున్నారు. 177 పరుగులకే కుప్పకూలిందా జట్టు. పాకిస్థాన్ చేతిలోనూ పరాజయం చవిచూసింది. కాబట్టి న్యూజిలాండ్‌ కంటే కూడా బలంగా కనిపిస్తున్నప్పటికీ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఫేవరెట్‌గా చెప్పలేని పరిస్థితి.

ఆర్నెల్ల ముందు వరకు చాలా సాదాసీదాగా కనిపించిన న్యూజిలాండ్ జట్టు.. గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శన చేస్తూ వస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఆ జట్టుకు ఓటమన్నదే లేదు. మొన్న క్వార్టర్స్‌లోనూ వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. జట్టులో స్టార్ ఆటగాళ్లు తక్కువే కానీ.. అందరూ సూపర్ ఫామ్‌లో ఉండటం, పైగా సొంతగడ్డపై ఆడుతుండటం వల్ల మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది కివీస్.

ఈ మ్యాచ్‌లో అందరి కళ్లూ నిలిచి ఉన్నది దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ మీదే. ప్రపంచంలో అత్యుత్తమ వన్డే ఆటగాడు అతనే అనడంలో ఎవరికీ సందేహాల్లేవు. క్రీజులో కుదురుకున్నాడంటే అతను బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఒంటి చేత్తో తన జట్టును గెలిపిస్తాడు. ప్రత్యర్థిని ఓడిస్తాడు. న్యూజిలాండ్ బౌలర్లు అతడికి దొరికారంటే మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. అతణ్నిత్వరగా పెవిలియన్ చేరిస్తే కివీస్ సగం మ్యాచ్ గెలిచేసినట్లే. ఈ మ్యాచ్ రేపు ఉదయం ఆరున్నరకే మొదలవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: