తెలంగాణ శాస‌న‌మండ‌లిలోని  హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్  ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం, రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఫ‌లితాల్లో ఢిల్లీ క‌నిపిస్తుందట‌!! అధికారం ద‌క్కింద‌నే భావ‌న‌తో ప‌ట్ట‌రాని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ స‌ర్కారుకు గుణ‌పాఠం చెప్పే విధంగా ఆ రెండు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితాలు ఉంటాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

సామాన్యుల‌కు అండ‌గా నిలుస్తాడ‌నే న‌మ్మ‌కంతో ఆమ్ ఆద్మీ నేత అర‌వింద్ కేజ్రివాల్‌కు ఢిల్లీ రాష్ర్ట ఎన్నిక‌ల్లో అండ‌గా నిలిస్తే ఆయ‌న మితిమీరిన అహంకారంతో 43 రోజుల్లోనే అధికారం వ‌దులుకున్నారు. దీంతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి స‌రైన గుణ‌పాఠం చెప్పారు ఢిల్లీ ఓట‌ర్లు. ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థిని గెలిపించ‌లేదు. ఇదిలాఉండ‌గా...సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ ఢిల్లీ అవ‌స్థ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని బీజేపికి ఆ రాష్ర్ట ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చ‌క్క‌టి పాఠం చెప్పారు. 70 సీట్లు గ‌ల ఢిల్లీ అసెంబ్లీలో కేవ‌లం 3 సీట్ల‌కే ఢిల్లీ బాద్ షా అయిన మోడీని స‌రిపెట్టారు. ప్ర‌జ‌లంటే లెక్క‌లేన‌ట్లు ఉంటే ఏ విధంగా ఉంటుంద‌నేది ఈ ప‌లితాల ద్వారా రుజువైంది. 

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌ఫున దేవీప్రసాద్ రావు,పల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిల‌కు ఓట‌మి దారిప‌ట్టించి తెలంగాణ ప్ర‌జ‌లు ఢిల్లీ పాఠాన్ని అధికార పార్టీకి రుచి చూపించ‌నున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెద్దరికానికి పోయి తెలంగాణ రాష్ర్ట స‌ర్కారు ప్ర‌క‌టించిన ఫిట్‌మెంట్‌ను బాండ్ల రూపంలో ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల ఉద్యోగులకు టీఆర్ఎస్ దూరం అయింద‌నే భావ‌న వినిపిస్తోంది. తెలంగాణ రాష్ర్టం మిగులు రాష్ర్టంగా ఉంద‌ని ప్ర‌క‌టించి అదే స‌మ‌యంలో నిధుల కొరత ఉన్న‌పుడు ఇచ్చే బాండ్ల‌ను ఉద్యోగుల‌కు ఇవ్వ‌డం అంటే త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డానికి నిద‌ర్శ‌న‌మని వారు మండిప‌తుతున్నారు. తెలంగాణ వ‌స్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం అర్హుల‌ను తీవ్రంగా నిరాశ‌కు గురిచేస్తోంది. ఇప్ప‌టికే ఉస్మానియా యూనివ‌ర్సిటీలోని నిరుద్యోగులు నిర‌స‌న‌లు కూడా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇదే కాకుండా  దేవీప్రసాద్ రావు,పల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిల‌పై ఉన్న వ్య‌తిరేక‌త కూడా వారి ఓటిమికి దోహ‌ద‌ప‌డవ‌చ్చ‌ని అంటున్నారు. 

మొత్తంగా తెలంగాణ రాష్ట్రం అంటే త‌మ జాగీరులా పాలన సాగిస్తున్న టీఆర్ ఎస్‌కు పాఠం నేర్పేలా తెలంగాణ ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ తీర్పును ఇవ్వ‌నున్నారు. ఒక‌వేళ టీఆర్ ఎస్ గెలిస్తే అది ప్ర‌జ‌లు ఇచ్చిన మ‌రో చాన్స్‌గా భావించాలే త‌ప్ప వారికి ఇచ్చిన మెజార్టీగా భావించ‌వ‌ద్ద‌ని వారు పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: