తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హోదా వ్యవహారంపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఆయన ఎంపీ గా ఉన్నారా.. ఎమ్మెల్యేనా.. అనే విషయం అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికి అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ శాసనసభకు హాజరవుతున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే కాదు! ఎమ్మెల్సీ కాదు! ఈ హోదాలేవీ లేకపోయినా ఆరు నెలల పాటు మంత్రిపదవిని చేపట్టడానికి అవకాశం ఉంది కాబట్టి కడియం ఈ హోదాలో ఉన్నారు. అయితే ఈయన ఇప్పటి వరకూ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయలేదు!

ఎంపీ హోదాలోనే ఆయన జీతం తీసుకొంటున్నారట. ఎంపీగా ఉండి పార్లమెంటు సమావేశాలకు కాకుండా.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ కొత్త రికార్డు సృష్టించాడు కడియం శ్రీహరి. ఇంత వరకూ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి ఫీటును సాదించిన వారు ఎవరైనా ఉన్నారో లేదో కానీ.. కడియం మాత్రం ఈ డిఫరెంటు రూటులో వెళుతున్నారు.

నైతికంగా చెప్పాలంటే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన రోజే కడియం తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సింది. ఆరు నెలల వరకూ అవకాశం ఉంది కాబట్టి.. ఆ లోపు తెలంగాణలో ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేయడమో లేక ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడమోజరగాల్సింది. అయితే కడియం మాత్రం అలా చేయడం లేదు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉంటే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ సీటుకు ఎన్నికలు కూడా షెడ్యూల్ అయ్యేవి. కానీ ఆ పని ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదు. చట్టపరంగా అడ్డంకులు లేవు కాబట్టి కడియం ఎంపీ గా ఉంటూ.. ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నట్టుగా ఉన్నాడు. ఆరు నెలల వరకూ అయితే ఇలా కొనసాగడానికి అవకాశం ఉంది.  ఆ గడువులో ఇప్పటికే కొన్ని నెలలు గడిచిపోయినట్టుగా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే కొన్ని నెలల తర్వాత ఆయన ఎమ్మెల్యేగానో.. ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకూ ఎంపీ హోదానైతే వదులుకొనేలా లేడు! 


మరింత సమాచారం తెలుసుకోండి: