తెలుగు రాష్ట్రాల్లోని పెద్దల సభకు  జరిగిన ఎన్నికలు మేధావి వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు, ఓటర్లు పెద్ద మనుషుల్లాగే వ్యవహరించారా... ? లేదంటే సాధారణ ఎన్నికల తరహాలోనే డబ్బు, మద్యం, కులం, మతం, వర్గం, ప్రాంతం వంటి ప్రలోభాలకు లోనయ్యారా అన్నది అంతటా చర్చనీయాంశమైంది. సాధారణ ఎన్నికలకు ఇవేమీ తీసిపోనట్లు జరిగాయని తేల్చారు.

ఎప్పటినుంచో ఎన్నికల ప్రక్రియలో ఇమిడిపోయిన ఆర్ధిక ప్రలోభాలను అరికట్టేందుకు కొద్దికాలంగా ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్యవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని కల నిర్వహణలో అనేక సంస్కరణలకు రూపకల్పన చేశారు. కానీ ఎన్నికల్లో ధన ప్రవాహం మాత్రం తగ్గుముఖం పట్టలేదు. పైగా రోజు రోజుకు ఇదే ప్రధానమౌతోంది. 2009 ఎన్నికల్లో అప్పటి కేంద్రమంత్రి చిదంబరం సుమారు 17లక్షలమంది ఓటర్లున్న పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటుకు పదివేల చొప్పున పంపిణీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్ప టికీ ఇప్పటికీ ఓట్లకొనుగోలులో ఇదే అత్యధిక ధరగా రికార్డుల కెక్కింది. ఆ తర్వాత జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ధనం, మద్యం ప్రధాన భూమిక పోషించాయి. ఈ దశలో కనీసం ఎగువ సభల ఎన్నికలైనా సజావుగా జరుగుతాయని పరిశీలకులు ఆశించారు. అలాంటి అవకాశం లేనేలేదని తాజా ఎన్నికలు రుజువు చేశాయి. 

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. డబ్బేకాదు.. అత్యంత విలువైన బంగారు, వెండి వస్తువుల్ని కూడా ఓటర్లకు ఎరగావేశారు. వీటినందుకోవడానికి ఓటర్లు పోటీలు పడ్డారు. క్యూలైన్లలో నిలబడీ సంతకాలు చేసి మరీ వాటిని దొరకబుచ్చుకున్నారు. అలాగని పెద్దల సభకు ఓటర్లు ఆషామాషీ వ్యక్తులా అంటే అదీకాదు.. కొన్ని నియోజకవర్గాల ఓటర్లు అత్యున్నత విద్యావంతులు కాగా.. మరికొన్ని నియో జకవర్గాలకు ఉపాధ్యాయులు, వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాల అచార్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరంతా నెలకు కనీసం 60 వేలకు పైగా జీతాలు పొందుతున్నారు. ఇలాంటివార్ని కూడా ప్రస్తుత రాజకీయాలు కలుషితం చేసేశాయి. నిస్సిగ్గుగా ప్రజా స్వామ్యానికి వలువలు వలిచేశారు. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు. ఎన్నికల విధానాన్నే అపహాస్యం చేశారు. ఇందులో అభ్యర్ధుల్తో పాటు ఓటర్లు కూడా సమానస్థాయిలో పాలుపంచుకున్నారు. 

గతంలోనూ ఓట్ల కోసం డబ్బిచ్చేవారు.. అయితే తమకు ఖచ్చితంగా ఓటేస్తారన్న వారికి యాభేయ్యో వందో ఇచ్చి వారి అవసరాల్ని అభ్యర్ధులు ఆదుకునేవారు. ఒక అభ్యర్ధి నుంచి లాభం పొందితే ఓటరు మరో అభ్యర్ధి వైపు తొంగిచూసేవారుకాదు. ఖచ్చితంగా అదే అభ్యర్ధికి ఓట్లేసి నిబద్దతను చాటుకునేవారు. కానీ ప్రస్తుతం ఓటర్ల తీరు మారింది. దాదాపు ప్రతి అభ్యర్ది నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది. ప్రధాన అభ్యర్ధులు వెండి సామాన్లు, వేల రూపాయల నగదును ఓటర్లకు ఎరగావేశారు. ఒక్కో అభ్యర్ధి 20కోట్లకు పైగా ఖర్చుపెట్టారు. ఆఖరుకు ఓటర్లు వద్దనే అవకాశం కూడా లేకుండా వారందుబాటులో ఉన్నా లేకున్నా ఇంటికెళ్ళి మరీ బహుమతులు, నగదు ఇచ్చేశారు. ఇలాంటి అభ్యర్ధులు గెలుపొంది చట్టసభల్లో ప్రవేశించినా వారెలాంటినిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికి అనుగుణమైన నిర్ణయాలవైపు మొగ్గుచూపుతారన్న సంశయం ప్రజాస్వామ్యవాదుల్లో ఏర్పడింది. 

మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఎన్నికల సంస్కరణల కోసం ఎన్నికల్లో ధనం, మద్యం నిరోధానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో పెద్దల సభగా పేర్కొనే మండలికి జరిగిన ఎన్నికల్లో ప్రతినిధుల నిర్ణయం భావిభారత ప్రజాస్వామ్య పరిపుష్టిపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. బుధవారం ఫలితం తేటతెల్లం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: