పారిశ్రామిక రంగానికి ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పరిశ్రమలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపింది. హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీ పరిశ్రమలపై రూ.730 కోట్ల బరువు వేసింది. ఇందులో హెచ్‌టీ కేటగిరీ నుంచి రూ.645 కోట్లను ఛార్జీలను పెంచడం ద్వారా వసూలు కానున్నాయి. ఫిక్స్డ్‌, డిమాండ్‌ ఛార్జీల భారాన్నీ భారీగా మోపింది. కుటీర పరిశ్రమలు, సీజనల్‌, ఆక్వా, చెరకు, పుట్టగొడుగులు, గ్రీన్‌ హౌస్‌, పట్టు పరిశ్రమల జోలికి వెళ్లకపోయినా, సాధారణ పరిశ్రమలపై ప్రభుత్వం  ఛార్జీలను పెంచుకుంటూ పోయింది. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తులకు రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పేరుతో దేశీయ పరిశ్రమలు.. తయారీ రంగానికి భారీ ఎత్తున ప్రోత్సాహం ఇచ్చేందుకు కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పరిశ్రమలపై విద్యుత్ భారం వేసి షాక్ ఇచ్చారు. దీంతో ఏపీలో మేక్ ఇన్ ఇండియా కాస్తా షాక్ ఇన్ ఇండియా అయ్యేలా ఉంది.

మరోవైపు పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై టైమ్‌ ఆఫ్‌ ద డే (టీఓడీ)ని వర్తింపజేశారు. దీని ప్రకారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై అదనపు ఛార్జీలను వసూలు చేస్తారు. ఇది పరిశ్రమలకు మరింత భారాన్ని మిగల్చనుంది. టీఓడీ విధానాన్ని ఎత్తేయాలని పారిశ్రామికవేత్తలు మొర పెట్టుకుంటున్నప్పటికీ.. పరిశ్రమలకు పెద్ద పీట వేస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.

మున్సిపాలిటీలు, పంచాయితీల పరిధుల్లోని వీధి దీపాలు, మంచినీటి సరఫరా పథకాలకు కూడా అయిదు శాతం విద్యుత్‌ ఛార్జీలను వర్తింపజేశారు. వీధి దీపాలకు ఈ సారి భారీ ఛార్జీలను వసూలు చేయడం వల్ల మున్సిపాలిటీలు, పంచాయితీ రాజ్‌ల నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిల భారం మరింత పెరుగుతుందే తప్ప డిస్కమ్‌లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అధికారులు చెబుతున్నారు. వీధి దీపాలకు విధించిన ఛార్జీల వివరాలిలా ఉన్నాయి..

దేన్నీ వదలలేదు...

అపార్టుమెంట్లను కూడా ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల పెంపుదల నుంచి వదల్లేదు. అపార్టుమెంట్లు, టౌన్‌ షిప్పులు, కాలనీల కోసం ప్రత్యేక టారిఫ్‌ను ప్రకటించింది. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లకు సరఫరా చేసే విద్యుత్‌పైనా భారీగా వడ్డింపులు విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: