కాలం మారేకొద్దీ అన్నీ మారతాయి. క్రికెట్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా కొత్త కొత్త ఎత్తుగడలతో బరిలోకి దిగుతున్నారు. ఐతే బౌలర్లు ఎన్ని వ్యూహాలు పన్నినా బ్యాట్స్‌మెన్ ఎప్పటికప్పుడు ప్రతి వ్యూహాలతో రెడీ అయిపోతుంటారు.

ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. షార్ట్ పిచ్ బంతుల్ని ఎదుర్కోవడంలో భారత స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రైనా షార్ట్ పిచ్ బంతులకు ఇబ్బంది పడతాడన్న సంగతి కొత్తదేమీ కాదు. ఐతే ఈ మధ్య మనోడు ఈ తరహా బంతుల్ని బాగానే ఎదుర్కొంటున్నాడు.

దీనికి కారణం టెన్నిస్ బంతులతో సాధన చేస్తుండటమే. టెన్నిస్ బంతులతో టర్ఫ్ మీద సాధన చేయడం కూడా పాత పద్ధతే కానీ.. రైనా మాత్రం కోచ్ డంకన్ ఫ్లెచర్‌తో టెన్నిస్ రాకెట్‌తో సర్వీసులు చేయించుకుని మరీ సాధన చేస్తున్నాడు.

రాకెట్‌తో సర్వీస్ చేస్తే బంతి ఎంత వేగంతో వస్తుందో, ఎంత ఎత్తుకు బౌన్స్ అవుతుందో అంచనా వేయొచ్చు. ఆ బంతుల్ని బ్యాట్‌తో ఎదుర్కోవడం కచ్చితంగా సవాలే. ఈ మధ్య రైనా సాధన ఇలాగే సాగుతోంది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు ముందు ఈ సాధన మరింత పెంచాడు. ఫ్లెచర్, ధోని.. ఇద్దరూ అతడికి సర్వీస్‌లు చేశారు. కాబట్టి సెమీస్‌లో భీకరమైన ఆస్ట్రేలియా బౌలర్లకు రైనా సరైన సమాధానమే ఇస్తాడని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: