1992 ప్రపంచకప్ చూసిన వాళ్లందరూ దక్షిణాఫ్రికా బ్యాడ్ లక్ గురించి అంత సులభంగా మరిచిపోలేరు. వర్షం వల్ల 45 ఓవర్లకు కుదించిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మొదట ఇంగ్లాండ్ 252 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా బాగానే ఆడుతూ లక్ష్యం దిశగా వెళ్లింది. 42.5ఓవర్లలో ఆ జట్టు స్కోరు 231/6.


ఇంకో 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు విజయంపై ఆశతోనే ఉంది. ఐతే ఉన్నట్లుండి వర్షం వచ్చి పది నిమిషాలు మ్యాచ్ ఆగింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని సవరించగా.. ఉన్నట్లుండి 1 బంతిలో 22 పరుగులు చేయాలంటూ స్క్రీన్ మీద సమీకరణం ప్రత్యక్షమయ్యేసరికి సఫారీలతో పాటు క్రికెట్ ప్రపంచమంతా షాకైంది.


ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్యంగా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అప్పట్నుంచి దక్షిణాఫ్రికాను ప్రపంచకప్‌లో దురదృష్టం వెంటాడుతూనే వస్తోంది. ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో మరోసారి వర్షం పడింది.


దక్షిణాఫ్రికా 38 ఓవర్లకు 216/3తో ఉన్న దశలో వర్షం వల్ల దాదాపు గంట పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఓవర్లను 43 ఓవర్లకు కుదించారు. చివరికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. న్యూజిలాండ్ లక్ష్యాన్ని43 ఓవర్లలో 298 పరుగులుగా నిర్ణయించారు. మరి ఇది దక్షిణాఫ్రికాకు సానుకూలమవుతుందో.. ప్రతికూలమవుతుందో చూడాలి. చివరికి ఫలితం ఎలా ఉంటుందో కానీ.. వర్షం పడగానే దక్షిణాఫ్రికా అభిమానుల గుండె గుబేల్‌మని ఉంటుంది. చూద్దాం చివరికి ఏమవుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: