ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో అధికార తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడంలో ప్రతిపక్ష నేత జగన్‌ ప్రధానంగా ఎక్కడ విఫలమవుతున్నారు? ఏ విషయాన్ని ఆయన వ్యతిరేకించలేకపోతున్నారు? దానిని వ్యతిరేకించడం ద్వారా తనకు మైలేజీ వస్తుందని తెలిసినా ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం.. అసెంబ్లీ వేదికగా వైఎస్‌ పాలనకు, ఆ తర్వాత సాగిన రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డిల పాలనకు తేడా ఉందని, ఆ రెండూ వేర్వేరని గట్టిగా చెప్పలేకపోవడమే.


వైసీపీ విమర్శల నుంచి తప్పించుకునే అవకాశం


మంగళవారంనాటి అసెంబ్లీలో విద్యుత్తు అంశంపై జగన్‌ మాట్లాడిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో రోజుకు 18 గంటలపాటు కరెంటు ఇవ్వలేదని, అదే సమయంలో రూ.23 వేల కోట్ల భారం ప్రజలపై వేశారని చెప్పారు. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో కూడా పలు అంశాలపై చర్చ సందర్భంగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించినప్పుడు వైసీపీ నేతలు టీడీపీ నేతల వాదనను ఖండించేవారు. తద్వారా కాంగ్రెస్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలను వారు సమర్థించినట్లు అయ్యేది. వైఎస్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలు వేరు.. ఆ తర్వాత  కాంగ్రెస్‌ పాలన వేరు అనే అభిప్రాయాన్ని అసెంబ్లీలోనూ అటు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ వ్యూహకర్తలు తీవ్రస్థాయిలో విఫలమయ్యారు.


టీడీపీ కంటే ముందే కాంగ్రెస్‌పై విమర్శలు

వాస్తవానికి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో కరెంటు చార్జీలను పెంచడానికి టీడీపీ మద్దతు ఇచ్చిందని, విప్‌ జారీ చేసి మరీ కిరణ్‌ ప్రభుత్వాన్ని కాపాడిందని జగన్‌ ప్రస్తావించినా.. అసలు టీడీపీ కంటే ముందే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించడంలో వైసీపీ విఫలమవుతోంది. ఇంకా చెప్పాలంటే, వైసీపీని తోసి రాజని అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రాణం పోసేలా వైసీపీ వ్యవహరిస్తోంది. ఇదే విషయంలో అధికార టీడీపీకి అడ్డంగా దొరికిపోతోంది. వైఎస్‌ పాలనను మినహాయించి కాంగ్రెస్‌ను, టీడీపీని కలగలిపి విమర్శించడం ద్వారా వైసీపీ విమర్శల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: