వార్నర్‌ను 12 పరుగులకే ఔట్ చేసి.. తొలి పవర్ ప్లేలో ఆస్ట్రేలియాను కట్టడి చేసేసరికి మన బౌలర్లకు తిరుగులేదనుకున్నారు. కానీ స్టీవెన్ స్మిత్ (105), ఫించ్ (81) జోడీని విడదీయలేకపోయారు భారత బౌలర్లు. ఓ దశలో 34 ఓవర్లకు 197/1తో పటిష్ట స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా సులభంగా 350 పరుగులు దాటేలా కనిపించింది. కానీ భారత బౌలర్లు పుంజుకుని ఆస్ట్రేలియాను బాగానే కట్టడి చేశారనే చెప్పాలి. చివరికి ఆస్ట్రేలియా భారత్‌ ముందు 329 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది ఆస్ట్రేలియా.


మామూలుగా ఐతే ఇది భారీ లక్ష్యమే. ఆస్ట్రేలియాకు స్టార్క్, జాన్సన్, హేజిల్ వుడ్, ఫాల్క్ నర్ లాంటి మేటి బౌలర్లున్నారు కాబట్టి ఈ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. అలాగని విజయం అసాధ్యమూ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి లక్ష్యాలు ఛేదించడం మామూలే.


సిడ్నీ వికెట్ బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరిస్తోందని తొలి ఇన్నింగ్స్‌లోనే స్పష్టమైంది. భారత బ్యాటింగ్ బలం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టోర్నీలో మన బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉన్నారు కూడా. ధావన్ దగ్గర్నుంచి ధోని వరకు అందరూ మ్యాచ్‌ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. ఫామ్‌లో లేని రోహిత్ కూడా ఊపందుకున్నాడు.


ఇప్పుడు కావాల్సిందల్లా శుభారంభమే. అది దక్కితే.. భారత్‌‌కు లక్ష్యఛేదన అసాధ్యమేమీ కాదు. 10 ఓవర్ల తొలి పవర్ ప్లేలో ఓపెనర్లు ధావన్, రోహిత్ వికెట్ కోల్పోకుండా ఓ మోస్తరు స్కోరు సాధిస్తే.. ఆ తర్వాత వేగం పెంచి లక్ష్యం దిశగా సాగొచ్చు. కోహ్లి ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మిడిలార్డర్లో రైనా, ధోనిలకు సవాల్ ఎదురుకావచ్చు. జడేజా సహా లోయరార్డర్ కూడా రెడీగా ఉండాలి. కలిసి పోరాడితే విజయం అసాధ్యమేమీ కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: