సిద్ధాంతాలకు కట్టుబడి, హిందూత్వాన్ని కాపాడే పార్టీగా చెప్పుకునే భారతీయ జనతాపార్టీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో పరవు పోగొట్టుకుంటోంది. రోజుకో సీనియర్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మరింత బజారుకు పడుతున్నారు. వివేకానందుడి ఐక్యూతో దావూద్ ఇబ్రహీం ను పోల్చి నితిన్ గడ్కారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడవి చల్లారక ముందే మరో సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మాలానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భార్యా భర్తల సంభంధాలపై తాను వ్రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా రామ్ జెఠ్మలాని ఈ వ్యాఖ్యలు చేశారు.  కేవలం ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని అమాయకురాలైన సీతమ్మను అడవుల పాలు చేసిన శ్రీరాముడు మంచి భర్త కాదనీ, అందుకే రాముడంటే తనకు గిట్టదని అన్నారు. శ్రీరాముడే కాదు లక్ష్మణుడి పాత్ర కూడా సరిగా లేదని ఇలాంటివారి పట్ల తనకు ఎంతమాత్రం గౌరవం లేదని జెఠ్మాలనీ అన్నారు. శ్రీ ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, దీనిపై ఎవ్వరికీ క్షమాపణ చెప్పబోనని తన పేరులో కూడా రామ్ అన్న పదాన్ని చేర్చుకున్న రామ్ జెఠ్మాలనీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది.  అయోధ్య రాముడి పేరుతో ఎదిగిన పార్టీ కావడంతో జెఠ్మలానీపై మండిపడింది. మరోవైపు హిందూ సంస్థలు, సంఘ్‌ పరివార్‌ నేతలు కూడా జెఠ్మలానీ మాటలను తప్పుపట్టారు. రామ్‌ జెఠ్మలానీ పేరుకు బదులుగా రావణ్‌ జెఠ్మలానీ అనే పేరు పెట్టుకోవాలని హిందూ సంస్థల ప్రతినిధులు, మఠాధిపతులు సూచించారు. ఇదివరకు అద్వానీ కూడా జిన్నాపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. ఇప్పుడు గడ్కరీ, రామ్ జెఠ్మలానీ కూడా కొందరి విశ్వాసాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించి తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇది వారి వ్యక్తిగత వ్యాఖ్యలు అయినప్పటికీ... బీజేపీలో సీనియర్లుగా ఉండడంతో ఎంతో కొంత ఆపార్టీ ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. బీజేపీకి కీలక రాష్ట్రంగా భావిస్తున్న గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. మరి రాముడు మంచి మొగుడు కాదన్న జఠ్మలానీ వ్యాఖ్యలు బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆపార్టీ నేతలే ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: