రాష్ర్ట కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. ఇంతకాలం మాజీ ముఖ్యమంత్రుల వారసులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని అధిష్టానం పెద్దలు ఇప్పుడు... పార్టీలో వారి ప్రాధాన్యం పెంచారు. ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జగలం వెంగళరావు వారసులు మినహా.. నాదెండ్ల భాస్కర్ రావు, ఎన్టీఆర్, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి సంతానానికి పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డికి కేంద్ర రైల్వేశాఖ సహాయక మంత్రి పదవి కట్టబెట్టారు. ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. మరోసారి సీఎంను మార్చవచ్చన్న ఊహాగానాలతో... మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రె డ్డికి ఆపదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ఇప్పటికే శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రుల వారసులను ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ ముందస్తు వ్యూహంతోనే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో వైఎస్ జగన్ పార్టీలోకి రెడ్డి, కమ్మ సామాజిక వర్గం నేతలంతా వలస వెళ్తుండడంతో... వారిని కొంతైనా నిరోధించేందుకు ఈ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ వ్యతిరేకిగా ఉన్నారు. పైగా రెడ్డి సామాజిక వర్గం కావడంతో.. రాయలసీమలో కోట్లకు పదవి ఇవ్వడంవల్ల పార్టీలో రెడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావన కల్పించాలని కాంగ్రెస్ చూస్తోంది.  ఇక కోస్తాలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం చాలావరకు టీడీపీతో ఉంది. ఇటీవల వారితోపాటు కాంగ్రెస్ లో ఉన్న నేతలు కూడా వైఎస్ఆర్ లోకి వెళ్తున్నారు. అందవల్లే కాంగ్రెస్ లో సీనియర్లుగా ఉన్న కాపు వర్గాన్ని కాదని... కమ్మవర్గాన్ని ఆకర్శించేలా ఎన్టీఆర్‌ కుమార్తె పురంధేశ్వరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ కావూరిలాంటి వారు ఆగ్రహంగా ఉన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల్లో కూడా పురంధేశ్వరి కీలక పాత్ర వహించ వచ్చున్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఎంపీ జగన్ ను ఎదుర్కోనేందుకే అన్నట్టు కనిపిస్తోంది. అధిష్టానం పెద్దలకు విధేయులుగా ఉంటూ వస్తే పదవులు దానంతట అవే వస్తాయన్న సంకేతాలు పంపుతోంది. అయితే అధిష్టానం పెద్దల వైఖరిపై కొందరు ఆగ్రహంగా ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తమను కాదని... పార్టీ పేరుచెప్పి పబ్బం గడుపుకునే వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: