మరోసారి ఎమ్మెల్యేలకు , ఎమ్మెల్సీలకు ఐ ఫోన్ ల పంపకం దిగ్విజయం జరిగింది. ఆపిల్ కంపెనీ వారి లేటెస్ట్ వెర్షన్ ఫోన్లను ప్రభుత్వం వారికి పంచిపెట్టింది. దీని కోసం దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుగా తెలుస్తోంది! ఇదంతా ప్రజల సొమ్మే. మరి వారు ప్రజాప్రతినిధులు కాబట్టి.. ప్రజల  సొమ్మును వాడేసుకోవడానికి అర్హులు అనుకోవచ్చు. అయితే ఈ వాడుకోవడం ఒకసారి అయితే బాగుంటుంది. కానీ  ప్రతిసారీ ఇలా ఖరీదైన ఫోన్లను ప్రజల సొమ్ముతో పంచుతుండటం మాత్రం బాగోలేదు.


తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ మూడు సెషన్స్ లో సభాసమావేశాలు జరిగాయి. ప్రతి సారీ కూడా ఎమ్మెల్యేలకు ఐ డివైజ్ లు పంచడం జరిగింది. తిరుపతి వెంకన్న ప్రసాదం పంచినంత ఈజీగానే ప్రభుత్వం ఐ డివైజ్ లను ఎమ్మెల్యేలకు పంచుతోంది. మరి ఎంత ఎమ్మెల్యేలు అయితే మాత్రం ప్రతి మూడు నెలలకూ ఒకసారీ ఫోన్ లను మార్చాలా?! మూడు నెలలకు ఒకసారి ఇచ్చే ఫోన్లనువాళ్లేం చేస్తున్నారు? ఇప్పటి వరకూ రెండు సార్లు ఇచ్చారు. ఇప్పుడు మూడో సారి ఇచ్చారు. ఒక్కో ఎమ్మెల్యే మూడు డివైజ్ లను వాడుతున్నాడా?!


అంత అధునాతన వెర్షన్ డివైజ్ లు ఇవ్వకపోతే ప్రభుత్వానికి అవమానమా? ప్రజల సొమ్ముతో తాము అలా ఖరీదైన ఫోన్లను తీసుకోవడం ఎమ్మెల్యేలకు మాత్రం సబబేనా? ఏదో ఒకసారి అయ్యంటే పోనీలే అనుకోవచ్చు కానీ.. ఇలా అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతీసారీ ఇలా పంచడం మాత్రం కచ్చితంగా విడ్డూరమే. ఎన్నో వ్యవహారాల్లో దుబారాగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో కూడా తన దుబారాను కొనసాగిస్తోంది.


అయితే ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎంచక్కా ఐ ఫోన్లు తీసుకొంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకించే వైకాపా ఎమ్మెల్యేలు ఈ డివైజ్ లను తీసుకోవడానికి మాత్రం వెనుకాడటం లేదు! వచ్చింది చాల్లే అనుకొంటున్నట్టుగా ఉన్నారు. అంతే కదా.. ఉచితంగా వస్తే.. ఎవరైనా దేన్ని వదులుచుకొంటారు? అయినా.. ఇలా సమావేశాలు జరిగిన ప్రతిసారీ ఎమ్మెల్యేలకు ఫోన్లు ఇవ్వాలనే ఐడియా ఎవరిదో కానీ.. వారిని అనాలి మొదట!


మరింత సమాచారం తెలుసుకోండి: