కొందరికి కీర్తి చాలా ఆలస్యంగా వస్తుంది.. మిగిలిన ప్రపంచం గుర్తించే దాకా సొంతవాళ్లు అంతగా పట్టించుకోరు. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు విషయంలోనూ అదే జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడు ఖండాల్లోని ప్రపంచంలోని అతి ఎత్తైన 9 పర్వతాలను అధిరోహించడమంటే మాటలు కాదు.. అందులోనూ అతి తక్కువ కాలంలో ఈ పని పూర్తి చేయడం తమాషా కాదు.

ఈ విషయంలో మల్లి మస్తాన్ బాబును గిన్నీస్ బుక్ గుర్తించినా మన తెలుగోళ్లు గుర్తించలేదు. జాతీయమీడియా అరగంట సేపు ప్రత్యేక ప్రోగ్రామ్ రూపొందించినా.. తెలుగు మీడియా అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు పర్వాతారోహణలోనే ప్రాణాలు కోల్పోయిన తర్వాత మాత్రం.. కూలిపోయిన శిఖరం.. అంటూ పతాక శీర్షికలతో.. నిరంతంరం లైవ్ లతో ఒక్కసారిగా ఆకాశానికెత్తేశాయి. 

పేద కుటుంబంలో పుట్టిన మల్లి మస్తాన్ బాబు.. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో చదువుతున్నప్పుడే పర్వతారోహణంపై మక్కువ పెంచుకున్నారు. లక్షలు కురిపించే ఉద్యోగాలు దక్కే అవకాశం ఉన్నా సాహసాలనే మార్గంగా ఎంచుకున్నారు. ప్రపంచంలో ఎత్తైన 10 పర్వతాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 9 పర్వతాలపై  భారతీయ జెండాను ఎగరేశాడు. చిలీ, అర్జెంటీనా సరిహద్దుల్లోని సెర్రో ట్రెస్ క్రూజెస్ పర్వతాలను అధిరోహించేందుకు చెన్నై నుంచి డిసెంబరు 16న ప్రయాణమయ్యారు.

అత్యంత ప్రయాస తర్వాత.. చీలిలోని 6వేల 600 మీటర్ల ఎత్తు ఉన్న పర్వతం పైకి ఎక్కి.. తాను అనుకున్న లక్ష్యం సాధించారు. ఐతే.. అంతవరకూ విజయపథంలో దూసుకుపోయిన మస్తాన్ బాబుకు తిరుగుప్రయాణంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయి. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో మంచుతో కూడిన గాలులు వీయడం వల్ల అక్కడే చిక్కుకుపోయారు. రోజులపాటు అక్కేడే చిక్కుకుపోయి చివరకు మృత్యువాత పడ్డారు. 

మస్తాన్ బాబు మరణవార్తతో మస్తాన్‌ సొంత గ్రామం నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంగంలో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మస్తాన్ బాబు మృతదేహాన్ని పర్వతంపైనుంచి తీసుకువచ్చే బాధ్యతను చిలీ ప్రభుత్వం తీసుకుంది. దీనికి అర్జెంటీనా ప్రభుత్వమూ సహకరిస్తోంది. మస్తాన్‌బాబు మృతదేహం తీసుకురావడానికి  కనీసం మూడు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పర్వతారోహణలో 12 ఏళ్లుగా మల్లిబాబు ఎన్నో సాహసాలు చేశాడు. 14 రోజుల్లో 14రాష్ట్రాల్లో మారథాన్‌ చేసి రికార్డు సొంతం చేసుకున్నారు. 172 రోజుల్లో 7ఖండాల్లోని ఎత్తైన పర్వాతాలను అధిరోహించాడు. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల్లో ఏడింటిని తక్కువ కాలంలో అధిరోహించి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో తన పేరు నమోదు చేసుకున్నారు. 

మల్లి మస్తాన్ బాబు మృత్యువార్త తెలిసిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో పర్వత వీరునికి అశ్రునివాళిగా సందేశాలు వెల్లువెత్తాయి. తిరిగి రాని లోకాలకు మరలిపోయిన సాహసికి అక్షర మాలికలతో అభిమానులు నివాళులర్పించారు. తెలుగోడి సత్తాని ప్రపంచానికి చాటి మల్లి మస్తాన్ బాబుకు ఏపీహెరాల్డ్ ఘన నివాళులు అర్పిస్తోంది.. సలామ్.. మస్తాన్..


మరింత సమాచారం తెలుసుకోండి: