పదేళ్ళ అధికారం అనంతరం ప్రజల తిరస్కృతికి గురైన కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు నాయకత్వ దుమారం లేచింది. సోనియాగాంధీయే పార్టీని నడిపించాలని కొందరు అంటుంటే మరికొంతమంది రాహుల్‌గాంధీ రావాలని కోరుతున్నారు. 99 శాతం మంది పార్టీ కార్యకర్తలు సోనియాగాంధీనే నాయకురాలిగా కోరుకుంటున్నా రనే వ్యాఖ్యలతో పార్టీ ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ ఈ నాయకత్వ దుమారానికి తెరతీసారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాల్సిన అవసరం ఉందని సీనియర్‌ నాయకురాలు అంబికా సోనీ ప్రకటించారు. మరోవైపున పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్‌ రాహుల్‌ గాంధీ నాయక త్వాన్ని సమర్థిస్తున్నారు. నాయకత్వంలో తరం మార్పు అవసరమని ఆయన చెబుతున్నారు.

''ఒకరిని పక్కకు పెట్టి మరొకరిని తీసుకోవడం అనే ప్రశ్నే లేదు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలే మన అధ్యక్షు రాలు. మనకు ఆమె అవసరం ఉంది. మీరు కొద్ది రోజులుగా చూస్తున్నారు. రాష్ట్రం దాటి బయటకు వెళ్ళి రైతులతో సమావేశాలు జరుపుతున్నారు, పార్టీలో పునరుత్తేజం నింపుతున్నారు. మొత్తంగా పార్టీ ఆశావాదంతో ఉంది'' అని అంబికాసోనీ విలేకరులతో అన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అవుతారనే ఊహాగానాల నేపథ్యం లో పార్టీలో కొంతమంది ఆయనను కోరుకోవడం లేదని పార్టీ ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలను సోనీ తోసిపుచ్చారు. రాహుల్‌గాంధీ నెల రోజులుగా విరామంలో ఉన్నారు, రెండువారాల్లో ఆయన మళ్ళీ వస్తారు అని చెప్పారు. 

పార్టీలో 99 శాతం మంది కార్యకర్తలు సోనియాగాంధీనే నాయకురాలిగా కోరుకుంటు న్నారు, గతంలో కంటే ఇప్పుడే ఆమె అవసరం ఉందంటూ దీక్షిత్‌ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వంపై చర్చకు దారితీసాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడిన దిగ్విజరు సింగ్‌ తరం మార్పు జరగాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘిస్తారా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ''తరం మార్పు జరగాల్సిందే. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మాన్ని కాదంటారా?'' అని ఏఐసీసీలో సీనియర్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దిగ్విజరుసింగ్‌ విలేకరులతో అన్నారు. ఆయన చివరకు....తదుపరి పార్టీ చీఫ్‌ని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. అత్యున్నత స్థాయిలో మార్పునకు అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఈ విషయాన్ని నాయకురాలికి వదిలేద్దాం అని అన్నారు. ''ఇది ఆమె నిర్ణయించాల్సిన విషయం. ఆమె నాయకురాలు, నాయకురాలిగా కొనసాగుతున్నారు'' అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ. ఇది తీసుకునే నిర్ణయాన్ని ఏఐసీసీ ధృవీకరిస్తుందని వివరించారు. నాయకత్వం విషయంపై సందీప్‌ దీక్షిత్‌ చేసిన వ్యాఖ్యల్లోనూ ఎలాంటి తప్పు లేదని కూడా దిగ్విజరుసింగ్‌ అన్నారు.


మే నెలలో జరిగే ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ పగ్గాలు చేపట్టనున్నారని ముమ్మర ఊహాగానాలు పార్టీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం కూడా పార్టీ నాయకత్వ అంశం చర్చలకు దారితీసింది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే ఏఐసీసీ సమావేశాలను సెప్టెంబరుకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, మార్పు మరో ఆరు నెలలు జాప్యం జరగనుందని వచ్చిన వార్తలు అవాస్తవమని, ఇవి అనవసర ఊహాగానాలని ఏఐసీసీ తోసిపుచ్చింది. మీడియాలోని ఒక వర్గం ప్రసారం చేసిన వార్తలు 'ఏఐసీసీ మావేశాలు సెప్టెంబరుకు వాయిదా పడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం, రాజకీయ గందరగోళాన్ని సృష్టించే లక్ష్యంతోనే అనవసర ఊహాగానాలు పుట్టించారు'' అని పేర్కొన్నాయి. 

ఏఐసీసీ సమావేశాల తేదీలను ఇంకా నిర్ణయించాల్సి ఉంది. సంబంధితులందరికీ ఈ సమాచారాన్ని అందజేస్తాం అని కాంగ్రెస్‌ పార్టీ కమ్యూనికేషన్‌ విభాగం ఇన్‌ఛార్జీ రణదీప్‌ సూర్జేవాలా చెప్పారు. ఏఐసీసీ సమావేశాలను వాయిదా వేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినందున సెప్టెంబరు వరకు అత్యున్నతస్థాయిలో నాయకత్వ మార్పు సాధ్యం కాదనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేసారు. విరామంలో ఉన్న రాహుల్‌గాంధీ తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తదుపరి నాయకత్వం అంశం మరోసారి చర్చల్లోకి వస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ సారధిగా ఉన్న సోనియాగాంధీ 17 ఏళ్ళుగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతవారంలో అమేథీలో మీడియాతో మాట్లాడిన ఆమె రాహుల్‌ 'వెనక్కి వస్తాడు' అని ప్రకటించిన విషయం విదితమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: