హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు టీడీపీ నేతలపై కారాలు, మిరియాలు నూరిన సికింద్రాబాద్ శీనన్న(తలసాని శ్రీనివాస్ యాదవ్)ఎట్టకేలకు చల్లబడ్డాడు? మొత్తానికి అలక పాన్పు దిగారు. చాలా రోజుల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి, ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారట. అయితే, ఇది తాత్కాలికమా? లేక పూర్తిగా చల్లబడినట్లా? అంటే చెప్పడం కొంత కష్టంతో కూడుకున్నదనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  శీనన్న గత కొంత కాలంగా టీడీపీ పార్టీ మెట్లు కూడా ఎక్కడం లేదు. పార్టీని టార్గెట్గా చేసుకుని మాట్లాడారు. పట్నంలోనే కాకుండా ఆయనకు రాష్ర్ట వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శీనన్న వ్యాఖ్యలతో టీడీపీలో కొంత దుమారం చెలరేగింది. శీనన్న మాటలు చూస్తే ఒకానొక సందర్భంలో టీడీపీతో తెగదెంపులు కూడా చేసుకోవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ పార్టీవైపు చూస్తున్నట్లు అందరూ అనుకున్నారు. దానికి కారణం లేకలేకపోలేదు.  పార్టీని వీడి తిరిగి ‘దేశం’ గూటికి చేరిన దేవేందర్ గౌడ్కు రాజ్యసభ సీటు ఇవ్వడమే. దీనితో టీడీపీతో శీనన్న ఎడ ముఖం,పెడ ముఖం అన్నట్లుగా వ్యవహారిస్తూ వచ్చారు. తొలుత శీనన్నను కొంత సముదాయించే ప్రయత్నం జరిగినా రాను రాను ఆయనను పూర్తిగా వదిలేశారు. సమైక్యాంధ్ర గురించి మాట్లాడినా, తెలంగాణ గురించి మాట్లాడినా టీడీపీ ఏ మాత్రం పట్టించుకోలేదు. దాదాపుగా పట్నంలో శ్రీనివాస్ యాదవ్ను ఒంటరిగా చేసేంది టీడీపీ. అయినా, కొద్ది రోజులు తన వాడిని వేడిని ఏమాత్రం తగ్గించుకోలేదు శ్రీనివాస్.  గతంలో అసంత్రుప్తిని వ్యక్తం చేస్తే బాబే స్వయంగా శ్రీనివాస్ను పిలిచి బుజ్జగించే వారు. కానీ, ఈ దఫా అందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహారం తయారైంది. ఎవరూ శ్రీనివాస్ యాదవ్ను పట్టించుకోలేదు. ఇక చివరకు చేసేదేమీ లేక శ్రీనివాస్సే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి మెట్లు తొక్కడానీ తమ్ముళ్లు అంటున్నారు. మరో రెండ్రోజుల్లో సికింద్రాబాద్ లోని మహాంకాళి బోనాల జాతర వుంది. ఈ బోనాలను పురస్కరించుకుని శ్రీనివాస్ యాదవ్ మహాంకాళి ఆలయ ధర్మకర్తలి సభ్యుల్ని వెంట బెట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. బోనాలకు రావల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొంతసేపు బాబు-శ్రీనివాస్ యాదవ్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు.  అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ తమలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. మరో రెండ్రోజుల్లో జరిగే సికింద్రాబాద్ మహాంకాళి ఉత్సవాలకు ఆహ్వానించామనీ చెప్పారు. తమందరిదీ ఒకే కుటుంబమనీ, కుటుంబమన్నాక చిన్న చిన్న విభేదాలు రావడం సహజమంటూనే...సిటీకి సంబంధించిన పార్టీ విషయాలే మాట్లాడామనీ, కొన్ని సమస్యలు సర్దుకుపోయాయనీ, మిగతా విషయాలు తమ వద్ద ప్రస్తావనకు రాలేదన్నారు. దీన్ని బట్టి శీనన్న పూర్తిగా చల్లబడ్డాడా? లేక మరో మారు అసమ్మతి స్వరాన్ని వినిపిస్తాడా? అనేది చర్చనీయాంశంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: