తమ దాకా రానంత వరకు అందరూ నీతులు చెబుతారు! గులాబీ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇందుకు భిన్నం ఏమీ కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న కాలంలో గానీ, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమనాయకుడిగా ఉన్నప్పుడు గానీ.. కాంగ్రెస్‌ పార్టీలో ఉండే ‘సీల్డ్‌కవర్‌ కల్చర్‌’ను ఆయన ఎన్ని సార్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారో లెక్కలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ను.. లెక్కలేనన్ని సార్లు ఆయన ‘సీల్డ్‌కవర్‌ సీఎం’ అంటూ తూలనాడడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీలోని దుర్మార్గపు పెత్తందారీ పోకడలను కేసీఆర్‌ ఎండగట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే.. ఇప్పుడు అధికారం వెలగబెడుతున్న పార్టీకి తాను అధ్యక్షుడి హోదాలో ఉన్న సమయంలో కేసీఆర్‌ కూడా  అదే వైఖరి అవలంబిస్తున్నారు. జిల్లాలకు అధ్యక్షులను ఎన్నుకునే విషయంలో ప్రజాస్వామిక పోకడలకు అవకాశం ఇవ్వకుండా, అచ్చంగా కాంగ్రెస్‌ బాటలోనే నడుస్తూ సీల్డ్‌కవర్‌ సంస్కృతి ద్వారా పెత్తందారీ పోకడల్ని ప్రదర్శిస్తున్నారు కేసీఆర్‌. 
కాంగ్రెస్‌ పార్టీ ఈ నెలాఖరులో ప్లీనరీ సమావేశాల్ని జరుపుకోబోతున్నది. ఆ నేపథ్యంలో జిల్లా శాఖలకు కూడా ప్రస్తుతం అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరుగుతున్నది. పార్టీ రాష్ట్రశాఖకు కూడా ఈనెల 20 న నామినేషన్ల పర్వం జరుగుతుంది. అయితే కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందన్న సామెత చందంగా.. తెరాసలో సంస్థాగత ఎన్నికలు ఎంతమాత్రం ప్రజాస్వామికంగా జరుగుతాయనే సంగతి.. జిల్లా అధ్యక్షుల ఎన్నిక సందర్భంగానే బయటపడిపోతున్నది. బుధవారం నాడు అయిదు జిల్లాలకు సంబంధించి ఆరుగురు జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కేబినెట్‌ మంత్రిని ఎన్నికల ఇన్చార్జిగా నియమించి వారిని అక్కడకు పంపారు. ఎక్కడా రెండో నామినేషన్‌ అంటూ వేయడం జరగలేదు. సీల్డ్‌కవర్‌లో కేసీఆర్‌ ఏ పేర్లను అయితే పంపించారో.. అదే పేర్లను అందరూ కలిసి అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లుగా ప్రకటించేయడం జరిగింది. ఉద్యమంలోంచి పుట్టిన పార్టీలో కూడా ఇంతగా అప్రజాస్వామిక ఎన్నికల తంతు ఏమిటా? అని విస్తుపోవాల్సిన పరిస్థితి. 
కాంగ్రెస్‌ పార్టీకి ఇలా పెత్తందారీ ధోరణిలో వ్యవహరించడానికి హక్కు ఉందనుకోవచ్చు. అది ఒక రకంగా కుటుంబ పార్టీ. పార్టీ తమ పెరటి చెట్టు లాంటిది అని సోనియా కుటుంబానికి ఒక దృఢమైన విశ్వాసం. దానికి తగినట్లుగానే.. ఆ పార్టీలోని నాయకులందరూ కూడా నిత్యం సోనియా భజననే తమ జీవనసాఫల్య క్రతువుగా కొనసాగిస్తుంటారు. అలాంటి నేపథ్యంలో ఆ పార్టీ విచ్చలవిడిగా పెత్తందారీ పోకడలు పోవడం సహజం. సీల్డ్‌కవర్‌ ద్వారానే సమస్త కీలక నియామకాలు జరిగిపోవడం అక్కడ సహజం. దాన్ని ఎవ్వరూ తప్పుగా చూసే అవకాశం కూడా లేదు. అందరూ  ఆ ధోరణికి అలవాటైపోయారు. 
తాను ఉద్యమాన్ని నిర్వహించిన నాయకుడిగా.. కేసీఆర్‌ నుంచి ప్రజలు కాస్త ప్రజాస్వామిక ధోరణిని ఆశించే అవకాశం ఉంది. కానీ ఆయన కూడా అచ్చంగా కాంగ్రెస్‌ బాటలోనే సీల్డ్‌కవర్‌ ద్వారా పేర్లను పంపేసి.. వాటికి అనుకూలంగా ఎన్నికలకు వచ్చిన కార్యకర్తలతో ‘మమ’ అనిపించడం చిత్రమైన సంగతి. తాజాగా ఎన్నికలు జరిగిన అయిదింటిలో ఖమ్మంలో మాత్రం కేసీఆర్‌ అధ్యక్షుడిని మార్చారు. పాత అధ్యక్షుడిని కాకుండా.. ఎంపీగా ఓడిపోయిన బుడాన్‌ షేక్‌ను అధ్యక్షుడిగా చేశారు. మిగిలిన నాలుగు జిల్లాల్లో పాతవారినే తిరిగి ఎన్నిక చేయించారు. నల్గొండకు బండా నరేందర్‌రెడ్డి, కరీంనగర్‌కు ఈద శంకర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ తూర్పు పురాణం సతీశ్‌, పశ్చిమ లోక భూమారెడ్డి, రంగారెడ్డి నాగేందర్‌ గౌడ్‌ ఎన్నికయ్యారు. మరో అయిదు జిల్లాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి. పేరుకు ఎన్నికలే గానీ.. ముందే చెప్పుకున్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానం తరహా పెత్తందారీ బాటలో.. ఇవి కేసీఆర్‌ సాగించే నియామకాలే అని భావించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: