నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పక్షం విజయం సాధించింది. మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఖాళీలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. మహారాష్టల్రోని బంద్రా తూర్పు నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నారాయణ్ రాణే ఘోరపరాజయం చవిచూశారు. ఆరునెలల్లో రాణాకు ఇది రెండో ఓటమి. పంజాబ్‌లో అధికార ఎస్‌ఏడి ధూరి స్థానాన్ని దక్కించుకుంది. అక్కడ గోవింద్ సింగ్ లొంగోవాల్ విజయం సాధించారు. ముంబయిలో ప్రతిష్టాత్మక బంద్రా ఈస్ట్ నుంచి 63 ఏళ్ల కాంగ్రెస్ దిగ్గజం నారాయణ్ రాణే ఓటమిపాలయ్యారు. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో కోంకణ్ తీరంలోని కంకావలీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఈ ఆరునెలల్లో ఆయనకు రెండో ఓటమి. తృప్తి సావంత్ భర్త బాలా సావంత్ మృతి చెందడంతో బంద్రా ఈస్ట్‌లో ఉప ఎన్నిక జరిగింది. మహంకాళ్ త్సగావ్-కవతే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో దివంగత ఎన్‌సిపి నేత ఆర్‌ఆర్ పాటిల్ సతీమణి సుమతి పాటిల్ విజయం సాధించారు. సంగ్లీ జిల్లాలోని ఈ నియోజకవర్గం నుంచి లక్షా 12వేల ఓట్ల ఆధిక్యతతో ఆమె గెలిచారు. ఆర్‌ఆర్ పాటిల్ మృతి చెందడంతో ఆ స్థానాన్ని ఎన్‌సిపి నిలబెట్టుకుంది. సుమతి పాటిల్‌పై పెద్ద పార్టీలేవీ అభ్యర్థులను నిలబెట్టలేదు.


పంజాబ్‌లో అకాలీదళ్ అభ్యర్తి గోవింద్ సింగ్ లొంగోవాల్ ఘన విజయం సాధించారు. సిమర్ ప్రతాప్ సింగ్‌పై ఆయన గెలిచారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని ఫరుక్కాబాద్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి అధికార సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్తిని ఉర్మిళ రాజ్‌పుట్ ఘన విజయం సాధించారు. ఆమె భర్త సిట్టింగ్ ఎమ్మెల్యే కప్టాన్ సింగ్ ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది. ఉర్మిళ ఏకంగా 40వేల మెజారిటీతో బిజెపి అభ్యర్థి, మాజీ ఎంపీ గంగాచరణ్ రాజ్‌పుట్‌పై గెలిచారు. మహారాష్ట్ర అసెంబ్లీ విషయానికి వస్తే శివసేన, ఎన్‌సిపి బలాబలాల్లో ఎలాంటి మార్పూ లేదు. ఒకచోట శివసేన, మరోచోట ఎన్‌సిపి గెలిచాయి. పంజాబ్‌లో గెలిచిన శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి గోవింద్ సింగ్ మాజీ మంత్రి, అలాగే మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ధూరి ఎమ్మెల్యే అరవింద్ ఖన్నా (కాంగ్రెస్) రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గోవింద్ సింగ్ విజయంతో 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో అకాలీదళ్ బలం 59కి చేరింది.ఉత్తరాఖండ్‌లోని భగవాన్‌పూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి మమతా రాకేష్ గెలిచారు. బిజెపి ప్రత్యర్థి రాజ్‌పాల్ సింగ్‌పై 37వేల మెజారిటీతో గెలిచారు. దివంగత మాజీ మంత్రి సురేంద్ర రాకేశ్ సతీమణి మమత కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికల్లో పోటీచేశారు. మమతకు 59,205 ఓట్లు, రాజ్‌పాల్‌కు 22,296 ఓట్లు లభించాయి. 2012 ఎన్నికల్లో బిఎస్పీ టికెట్‌పై గెలిచిన సురేంద్ర ఫిబ్రవరిలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. హరీష్ రావత్ ప్రభుత్వంలో ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. మమత గెలుపుతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 36కి పెరిగింది. ఇక్కడ పోటీ చేసిన మిగతా అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: