ఫైట్‌ చేయాలంటే.. డైట్‌ చేయాలంటున్న ఎంపీగారు!
తిండి గలిగితే కండ గలదోయ్‌.. కండగలవోడు మనిషోయ్‌ అన్నారు మన గురజాడ అప్పారావు. అయితే అప్పారావు చెప్పిన మాటలకు ఈ ఎంపీగారు మాత్రం అచ్చంగా రివర్సులో వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రోడు గనుక అప్పారావు చెప్పిన మాటలు అక్షరసత్యాలు కాబోవని ఆయన నమ్మకమేమో గానీ.. ఈ గులాబీ ఎంపీ గారు.. ఫైట్‌ చేయాలంటే డైట్‌ చేయాల్సిందేనని అంటున్నారు. 


తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తరువాత.. తొలిసారిగా ప్లీనరీని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి.. ఆ పార్టీకి చెందిన నాయకులంతా ఎవరి ఏర్పాట్లలో వారు ఉంటున్నారు. అందులో భాగంగానే ఓ సీనియర్‌ నాయకుడు ఒక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు నిజామాబాద్‌ ఎంపీ.. ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాలనుంచి ఉద్యమానికి, తర్వాత పార్లమెంటుకు ఎదిగిన బాల్క సుమన్‌ కూడా హాజరయ్యారు. అయితే  బాల్క సుమన్‌ విందులో రకరకాల వెజ్‌, నాన్‌ వెజ్‌ నోరూరించే వంటకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా పరిమితంగా మాత్రమే.. వడ్డించుకుని భోం చేశారు. సహచరులు... అదేంటి అంత తక్కువ తింటున్నావ్‌.. బాగా తినాలి కదా అంటూ పలకరించబోతే... ‘ఫైట్‌ చేయాలంటే.. డైట్‌ చేయాలి కదా’ అంటూ ఆయన రిథమిక్‌ ఛలోక్తులు విసిరారు. 


ఫైట్‌ చేయడానికి డైట్‌ చేయడం ఎందుకు` ఫిట్‌గా ఉంటే సరిపోతుంది కదా! అనేది ఎక్కువ మంది సందేహం. అయినా మన భ్రమ గానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కూడా పార్లమెంటులో ఇప్పుడు ఫైట్‌ చేయడం అనేది మరచిపోయినట్లే ఉన్నారు. తొలిరోజుల్లో తెలంగాణ కు ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ అంటూ రెండు మూడు సార్లు పార్లమెంటులో హడావిడి చేసిన ఎంపీలు.. ఆ తర్వాత.. ఎవరికి వారు.. మౌనవ్రతాన్నే పాటిస్తున్నారు. చివరికి దేశవ్యాప్త వివాదంగా మారుతున్న, రైతులకు అన్యాయం జరుగుతుందని అందరూ భయపడుతున్న భూసేకరణ బిల్లు గురించి కూడా తెరాస ఎంపీలు ఎవరూ కనీసం పెదవివిప్పడం లేదు. ఇక ఎక్కడ ఫైట్‌ చేయడం గురించి బాల్క సుమన్‌ డైట్‌ చేస్తున్నారో.. ఆయనే చెప్పాలని మిత్రులు జోక్‌లు వేయడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: