తనను నమ్ముకున్న వాళ్లందరికీ ‘బుగ్గకార్లు’ కానుకగా ఇవ్వడం కేసీఆర్‌ ఎంచుకున్న విధానం. అందులో భాగంగా  ఆయన బోలెడు మందికి రకరకాల పదవులు ప్రసాదించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ పదవుల కేటాయింపు జరిగిందంటూ కోర్టువారు రద్దుచేసిపారేశారు. 


అయితే కేసీఆర్‌ తన వైఖరి ప్రకారం ఈ తిరస్కారాన్ని అంత తేలిగ్గా తీసుకునే రకం కాదని అందరికీ తెలుసు. తనను నమ్ముకున్న వారికి తాను బుగ్గకార్లు ఇవ్వదలచుకుంటే.. ఇలా కోర్టు మధ్యలో దూరి.. రద్దు చేసి పారేయడం ఆయనకు ఆగ్రహం తెప్పించిందిట. కోర్టు కాదంటే ఈ పదవులు పోతాయే తప్ప.. తన వారికి మేలు చేయకుండా మాత్రం ఆపేది లేదని ఆయన అనుకున్నారుట. అందుకే.. రాజ్యాంగ బద్ధంగా, మళ్లీ మరో రకమైన పితలాటకాలు ఎదురుకాకుండా ఉండేలాగా... బుగ్గకార్ల హోదా ఉండే మరే ఇతర పదవులను అయినవారికి కట్టబెట్టవచ్చో ఆరాలు తీయాలని ఆయన అధికార్లను ఆదేశించారుట. 


నిజానికి కేబినెట్‌ హోదాతో అన్యులకు కట్టబెట్టడానికి కూడా రాజ్యాంగబద్ధంగా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అలాంటి హోదాతో కేవీపీ రామచంద్రరావును సలహాదారుగా నియమించినప్పుడు ఈ సంగతి వెలుగులోకి వచ్చింది. ఆయన ఆ సలహాదారు పదవిని పరిమితంగా వాడుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన పెద్దలు విచ్చలవిడిగా వాడుకున్నారు. ఇదే మాదిరిగా ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం కూడా లేకపోయినా.. పదవులు కట్టబెట్టే మార్గాలు కొన్ని! అదే తరహాలో ఇప్పుడు పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్ని కోల్పోయి.. భంగపడిన తన వారికి మరింత నిశ్చింత సంతృప్తి కలిగేలా కొత్త పదవులు కట్టబెట్టడానికి కేసీఆర్‌.. కొత్త పదవుల అన్వేషణ జరపాల్సిందిగా అధికార్లను న్యాయనిపుణుల్ని పురమాయించినట్లు సమాచారం. 


అలాగే పదవులు కోల్పోయి బాధలో ఉన్న వారికి కూడా ఆయన భరోసా ఇచ్చారుట. బాధపడొద్దు.. తొందర్లోనే వీటిని మించిన పదవులు మీకు దక్కుతాయి అని చెప్పినట్లుగా రాజకీయ వర్గాల్లో సమాచారం. అందుకే కాబోలు.. ‘వడ్డించే వాడు మనవాడైతే పంక్తి చివర్లో కూర్చున్నా నష్టం లేదు ’ అనే సామెత పుట్టి ఉంటుంది అనుకుంటున్నారు జనం. 


మరింత సమాచారం తెలుసుకోండి: