ప్రతి నిత్యం సమస్యలతో సావాసం చేసే దేశ పౌరులు అవినీతి వ్యతిరేకంగా అడుగేస్తామంటున్నారు. ఉద్యోగ భద్రత లేదు, ఆహార భద్రత లేదు, జబ్బుచేస్తే వైద్యానికి ఇళ్లంతా గుళ్ల చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి స్థితిలో దేశంలోని ప్రజలు నాయకుడుగా ఎవరు రావాలనుకుంటున్నారు అన్నదానిపై దేశవ్యాప్తంగా CNN IBN, హిందుస్థాన్ టైమ్స్ జరిపన సర్వేలో ప్రజలు ఆసక్తికరమైన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రభుత్వం, పార్టీ, నాయకుడు అనే అంశాలపై స్పష్టమైన సమాధానం ఇచ్చారు.  దేశ స్థితి గతుల్ని మార్చే లీడర్ ఈ ప్రశ్నకి 24శాతం మంది నరేంద్రమోడీని బలపరిచారు, మన్మోహన్ కి 16శాతం మంది, సోనియాకు 16శాతం మంది ఓటేశారు. రాహుల్ ను మాత్రం కేవలం 13శాతం మంది మాత్రమే నాయకుడిగా కోరుకుంటున్నారు. పార్టీ పరంగా మాత్రం కాంగ్రెస్ కి 32శాతం మెజార్టీ రాగా, 28శాతం మంది బీజేపీవైపు మొగ్గు చూపారు. ఇది ఇప్పటి వరకూ ఉన్న లెక్కలు మాత్రమే. తర్వాత మారే అవకాశాలు ఉన్నాయని సర్వే అంచనాలు వెల్లడిస్తున్నాయి. తమకు ప్రధాన సమస్య నిత్యావసరాల ధరల పెరుగుగుదలే అని 63శాతం మంది ఒప్పుకున్నారు. 23శాతం మంది ప్రజలు ఇంధన రేట్ల పెరుగుదలని భరించలేకపోతున్నామన్నారు. ఉద్యోగాల విషయంలో కూడా దేశ పౌరులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. 58శాతం మంది ప్రజలు తమకి జాబ్ సెక్యూరిటీ లేదని వాపోయారు, కేవలం 35శాతం మంది మాత్రమే ఉద్యోగాల విషయంలో భరోసాగా ఉన్నారు. మన్మోహన్ తీరుపై ఆగ్రహం ప్రధాని మన్మోహన్ దేశప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారని సర్వే తెలియజేస్తోంది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు మన్మోహన్ ప్రభుత్వ చర్యలు శూన్యం అన్నవారు 55శాతం మంది, ప్రభుత్వ పనితీరు మెచ్చుకున్నవారు కేవలం 36శాతం మంది. సంస్కరణల విషయంలో ప్రధాని పంథా బాగోలేదని 49శాతం మంది అంటే, మన్మోహన్ ఫర్వాలేదని 33శాతం మంది వెల్లడించారు. అవినీతి వ్యవహారంపై కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతికి మూలం రాజకీయ నాయకులేనని 65శాతం మంది, అవినీతికి అవకాశం మనమే ఇస్తున్నామంటూ 19శాతం మంది చెప్పారు. ఇక అవినీతి వ్యతిరేక ఉద్యమంలో 65శాతం మంది అన్నాహజారేకి మద్దతు పలకగా.. కేజ్రీవాల్ దూకుడుని కేవలం 12శాతం మంది ప్రజలే మెచ్చుకున్నారు. ఓ 5శాతం మంది మాత్రం బాబా రామ్ దేవ్ ప్రయత్నం బాగుందని కితాబిచ్చారు. మొత్తానికి దేశ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారనేది సుస్పష్టం. అయితే అధికార పక్షం తప్పుల్ని, ప్రతిపక్షం సరిగ్గా ఎదుర్కోలేకపోతుందన్న అభిప్రాయం ప్రజల నుంచి వస్తోంది. అందుకే మోడీని కోరుకుంటున్నవాళ్లు కూడా పార్టీ పరంగా కాంగ్రెస్ కి ఓటేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: