ఏపీలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. కొన్నివర్గాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం లభించలేదన్న లోటు తీర్చాలని ఆయన భావిస్తున్నారు. దాంతోపాటు పనితీరు అంతగా నచ్చని మరికొందరిపై వేటుకు కూడా ఆయన రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

కేఈపై వేటు తప్పదా..?


వేటు జాబితాలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేరు ఉండవచ్చని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో సీనియర్ నైన తనకు పేరుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా.. అసలు అధికారమంతా చంద్రబాబు, పురపాలక మంత్రి నారాయణ చేతుల్లోనే ఉందన్న అసంతృప్తి కేఈలో ఉంది. ఆయన పలుసార్లు ఈ విషయంపై నిరసన వ్యాఖ్యలు చేశారు. 

కేఈ తీరుపై చంద్రబాబు ఆగ్రహం.. 


రాజధాని నిర్మాణం విషయంలో మొదలైన ఈ అసంతృప్తి క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొన్నటికి మొన్న జిల్లా ఇంచార్జి మంత్రుల నియామకంలోనూ కేఈ కి చోటు దక్కలేదు. తాజాగా కర్నూలు మినీ మహానాడులోనూ.. కేఈ నేరుగా ముఖ్యమంత్రి పశ్చిమగోదావరిపైనే ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు గుప్పించారు. 

కేఈ విమర్శలకు మీడియా ముందే చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు. బహిరంగవేదికలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్రంగానే అన్నారు. ఎలాగూ వేటు తప్పదన్న అభిప్రాయంతోనే కేఈ అసమ్మతి స్వరం పెంచుతున్నారనన్న వాదనలూ ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: