దూకుడులో నిర్ణయాలు తీసేసుకోవడం న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుని మళ్లీ వెనక్కు తగ్గడం... ఇది తెలంగాణ సర్కారుకు అలవాటైపోతున్నట్లుగా ఉన్నది. ఆంధ్రప్రాంతాన్ని నిందిస్తూ వారికి వ్యతిరేకంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని.. న్యాయపరమైన వివాదం తలకెత్తుకోకుంటే తమ శాఖ సవ్యంగా పనిచేసినట్లు కాదేమో.. అని ప్రభుత్వ శాఖలు భావిస్తున్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే పలుప్రభుత్వ నిర్ణయాలు కోర్టు ఎదుట అక్షింతలకు గురవుతూ వచ్చిన నేపథ్యంలో తాజాగా విద్యుత్‌ ఉద్యోగుల విభజన కూడా ఆక్షేపణకు గురికావడం గమనార్హం.


విద్యుత్తు ఉద్యోగుల విభజనకు సంబంధించి.. ఆంధ్రప్రాంతానికి చెందిన వారినంతా ఆ ప్రాంతానికి సరెండర్‌ చేసేస్తూ టీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు కూడా వచ్చేశాయి. అప్పటికే ఈ విషయం హైకోర్టులో నలుగుతున్నది. హైకోర్టులో విచారణ సాగుతున్న సమయంలోనే ఇలాంటి ఉత్తర్వులు రావడం కరెక్టు కాదంటూ కేసును మళ్లీ తిరగతోడారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుంది. 


తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. కోర్టులో పిటిషన్లు దాఖలైన సమయానికి ఎక్కడ ఉన్న ఉద్యోగులు అక్కడే ఉంటారని.. విద్యుత్తుశాఖ వారి ఉత్తర్వులు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని కోర్టు అక్షింతలు వేసింది. ఆ ఉత్తర్వులు సస్పెండ్‌ అయ్యేలా.. తెలంగాణ సర్కారు అఫిడవిట్‌ వేయాలని కూడా ఆదేశించింది. మరోవైపు ఈ విషయంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే గనుక.. అది తెలంగాణ ఉద్యోగుల పాలిట మరణశాసనం అవుతుందంటూ.. ఏజీ రామకృష్ణారెడ్డి వాదించినప్పటికీ... న్యాయస్థానం తీర్పు చెప్పడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: