మరో నెల రోజుల్లో గోదారమ్మ పుష్కరాలు జరగబోతున్నాయి. పుష్కరవైభవంతో దైవసమానంగా గోదారితల్లి అలరారనుంది. అయితే ఇంతలోనే పెనువిషాదం. దైవదర్శనానికి వెళ్లిన భక్తులను తిరిగి ఇంటికి తీసుకువెళ్తున్న వాహనం గోదావరిలో పడి.. 22 మంది దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ పైనుంచి తూఫాన్‌ వాహనం నదిలో బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిని మృత్యువు కబళించింది. 


శ్రీకాకుళం జిల్లా అచ్యుతాపురం మండలం మూసాయిపేట గ్రామానికి చెందిన ఈగల రాంబాబు కుటుంబానికి చెందిన వారు దైవదర్శనార్థం గత శనివారం నాడు తూఫాన్‌ వాహనంలో బయల్దేరారు. తిరుమల వెళ్లారు. అక్కడినుంచి తిరుగు ప్రయాణంలో విజయవాడ దుర్గమ్మ వారిని దర్శించుకుని స్వగ్రామానికి పయనం అయ్యారు. 
ధవళేశ్వరం బ్యారేజీపై ప్రయాణిస్తున్న వారి తూఫాన్‌ వాహనం ఏపీ 31 టీసీ 3178 శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవరు సహా 22 మంది మరణించారు. రాత్రి పదిగంటలకు వాహనం నదిలో పడితే.. శనివారం తెల్లవారుజాము వరకు ఎవ్వరికీ సమాచారం తెలియలేదు. శనివారం ఉదయం స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. 


ఈ ప్రమాదంలో గాయపడిన ఒక బాలుడు మాత్రం.. రాత్రి పది గంటల సమయంంలో ప్రమాదం జరిగినట్లు చెప్పాడు. అతనికి చికిత్స అందుతోంది. డ్రైవరు నిద్రమత్తులోకి వెళ్లినందునే ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. కాగా ఈ ఘోర దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సాయం అందించాల్సిందిగా డిప్యూటసీఎం చినరాజప్పను ఆదేశించారు. కలెక్టరు ద్వారా ప్రమాదకారణాలను తెలుసుకుని.. అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: