కొత్త‌గా ఏర్ప‌డ్డ ఆంద్ర‌ఫ్ర‌దేశ్ కు కొత్త రాజ‌ధాని కి రూప‌క‌ల్ప‌న  ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ప్ంచంలోనే అత్యుత్త‌మ రాజ‌ధానిగా నిర్మిస్తామ‌ని ముఖ్య మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెబుతున్నారు. రాజ‌ధాని ఎలా ఉండాలో సింగ‌పూర్ కంపెనీ లు ప్ర‌భుత్వానికి ఓ నివేదిక కూడా ఇచ్చారు. ఓకే దానికి అంద‌రు సంతోషించాల్సిన విష‌య‌మే, దానిని ఏవ్వ‌రు కాద‌న‌రు. కానీ ప్ర‌స్తుత స‌మ‌యంలోనే విశాల రాయ‌ల‌సీమ‌కు కొన‌సాగుతున్న  అన్యాయాల గురించి కూడా మాట్లాడుకుంటే మంచిది.అనాదిగా జ‌రుగుతున్న అన్యాయం ఏమిటో తెలిస్తే త‌ప్ప న్యాయం కోసం సీమ వాసులు గొంతు విప్ప‌లేరు. 

కర్నూలును ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కొరకు త్యాగం


నాటి సీమ నాయకులు మద్రాసును ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కొరకు, కర్నూలును ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కొరకు త్యాగం చేయగా, నేటి సీమ నాయకులు విజయవాడ- గుంటూరు ప్రాంతంలో నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని ఏర్పాటుకు తలలూపారు. గంజాంలోని మల్నాడ్‌ నుంచి చిన గంజాం దగ్గర్లోని మోటుపల్లి వరకు గల ప్రాంతాన్ని 1766, 1788 సంవత్సరాలలో బ్రిటీష్‌ వారికి నైజాం పాలకులు ఇచ్చారు. మద్రాసుకు ఉత్తరంగా ఉన్నందున నైజాం పాలకులు సర్కార్లు అనీ, బ్రిటీష్‌ వారు ఉత్తర సర్కార్లు అనీ ఆ ప్రాంతాన్ని పిలిచేవారు. సీడెడ్‌ జిల్లాలు అని ఆంగ్లేయులు పిలిచిన కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాల్ని 1800లో బ్రిటీష్‌ వారికి నిజాం నవాబు ఇచ్చారు. మోటుపల్లి నుంచి పులికాట్టు, తడ వరకు గల నాటి ఉమ్మడి నెల్లూరు మండలంతో పాటు, ఒంగోలు జిల్లా ప్రాంతాన్ని 1801లో బ్రిటీష్‌ వారికి నైజాం సామంతుడైన ఆర్కాటు నవాబు ఇచ్చారు.  ఈ ఆర్కాటు జిల్లాలు ఒకప్పటి తొండమండల ప్రాంతాలు. తెలంగాణ ఉన్న హైదరాబాద్‌ సంస్థానంలో సైన్యసహకార ఒప్పందం కింద నైజాం ఆధీనంలోనే బ్రిటీష్‌ వారి పరోక్ష పాలన సాగింది. దీంతో ఏ ప్రాంతానికా ప్రాంతం ప్రత్యేకంగా రూపుదిద్దుకోసాగింది.

ఒంగోలు(ప్రకాశం) జిల్లా ప్రాంతాల్ని రాయలసీమలో భాగంగా 

 
సర్కార్లు వలె తీరంలో ఉన్నందున మోటుపల్లి నుంచి పులికాట్‌- తడ వరకు గల పూర్వపు ఉమ్మడి నెల్లూరు-ఒంగోలు(ప్రకాశం) జిల్లా ప్రాంతాల్ని రాయలసీమలో భాగంగా చాలా కాలం గుర్తించలేదు. ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇది సీమనాయకులు చేసిన పెద్ద తప్పు. ప్రకాశం జిల్లా ఉత్తర సరిహద్దు నుంచి చిత్తూరు జిల్లా దక్షిణ హద్దు, అనంతపురం జిల్లా పశ్చిమ సరిహద్దు వరకు గల ప్రాంతాల్ని ఒకే భౌగోళిక ప్రాంతంగా వెనుకబడిన ప్రాంతంగా భావించి అక్కడి నీటి అవసరాలు, ఇతర అవసరాలు తీర్చడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. నవ్యాంధ్రపదేశ్‌ బడ్జెట్‌లో సగ భాగం ఈ విశాల రాయలసీమ కోసం ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకై ఉత్తర సర్కార్ల నాయకులతో మరో శ్రీబాగ్‌ ఒప్పందం కుదుర్చుకోవడానికి విశాల సీమ నాయకులు ప్రయత్నించాలి. 1913లో తొలి ఆంధ్రమహాసభ జరిగినా, 1915 నాటి మూడవ సమావేశంలో ప్రత్యేక తెలుగు రాష్ట్రంకై తీర్మానం చేసినా ఉత్తర సర్కార్ల వారితో కలిసి కొత్త రాష్ట్రంలో ఉండడంపై రాయలసీమ నాయకులు ఉత్సాహం చూపలేదు. . 


 
1926లో అనంతపురంలో ఆంధ్రావిశ్వవిద్యాయలం కేంద్రం ఏర్పరచాలని సెనేట్‌, మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సెలక్ట్‌ కమిటీలు ఆమోదించినా సర్కార్ల నాయకులు దీనిని జరగకుండా చేశారు. దీంతో సీమ నాయకుల్లో అనుమానాలు మరింత పెరగసాగాయి. ఇందుకు నిరసనగా 1928 డిసెంబరులో చిత్తూరు జిల్లాకు చెందిన బొల్లిని మునస్వామినాయుడు అసెంబ్లీలో సవరణ తీర్మానం ఒకటి ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సీమ కాలేజీలు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధమై, 1954లో ఎస్వీయూనివర్శిటీ తిరుపతిలో ఏర్పడే వరకు కొనసాగాయి. పప్పూరి రామాచార్యులు, కడప కోటిరెడ్డి వంటి వారైతే ఉత్తర సర్కార్ల వారి ఆధిపత్యంలో ఉండడానికి సమ్మతించలేదు. ఇక సీఎల్‌ నరసింహారెడ్డి, కె. సుబ్రహ్మణ్యం వంటి వారైతే 1934లో రాయలసీమ మహాసభను ఏర్చరచారు. అక్టోబరు 1937 నాటి ఆంధ్రమహా సభలో ఎమ్మెల్యేలు కడప కోటిరెడ్డి, హాలహర్వి సీతారామరెడ్డి వంటి వారు సీమలో రాజధాని ఏర్పాటు గురించీ, మంత్రి వర్గంలో సీమ, సర్కార్‌ ప్రాంతీయ సమానత గురించీ, తుంగభద్ర ప్రాజెక్టు వంటి ప్రాజెక్టుల గురించీ హామీ కోరారు. కడకు నవంబరు 16, 1937న శ్రీబాగ్‌ ఒప్పందం కుదిరింది.

కృష్ణపైన ఆనకట్టలు

 
సాగునీటిలో సీమకు జరుగుతున్న అన్యాయాలు పరిశీలిద్దాం. 1847లో గోదావరిపైన, 1853లో కృష్ణపైన ఆనకట్టలు నిర్మించినా విశాల సీమకు ఎలాంటి మేలూ జరుగలేదు. 1867-1870లో కాటన్‌ రూపొందించిన కేసీ కెనాల్‌తో కర్నూలులో 1,84,000 ఎకరాలు, కడపలో 94,000 ఎకరాలు సాగునీటి సౌకర్యం పొందాయి. 1880 ప్రాంతంలో తుంగభద్ర- కృష్ణా - పెన్నాల అనుసంధాన పథకంతో సీమలో 36 లక్షల ఎకరాల్ని సాగులోకి తేవడానికి సర్‌ మెకంజీ చేసిన ప్రయత్నం ఉత్తర సర్కార్ల నాయకులు, తమిళ ప్రాంత నాయకుల స్వార్థ ఆలోచనల వల్ల, నాటి సీమ నాయకుల దూరదృష్టి లోపం వల్ల అమలుకు నోచుకోలేదు. 1944లో ఉమ్మడి మద్రాసు, నైజాం ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంతో బళ్ళారి జిల్లా మల్లేశ్వరం వద్ద తుంగభద్రపై ప్రాజెక్టు నిర్మించినా, ఈ మరుగుజ్జు ప్రాజెక్టు వల్ల సీమ నీటి అవసరాలు తీరిందిలేదు. అందుకే సర్కార్ల నాయకులు దీనికి సమ్మతించారు.


1954లో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంకై జరిగిన ఒప్పందం కారణంగా కృష్ణానది నుంచి సీమ ప్రాజెక్టులకు నికర జలాలు లభ్యమయ్యే అవకాశం లేకుండా పోయింది. అదే ఏడాది తుంగభద్ర ప్రాజెక్టుకు చెందిన 20 శాతం నీరు, 80 శాతం విద్యుత్‌ ఆంధ్ర వాటాగా, 80 శాతం నీరు, 20 శాతం విద్యుత్‌ కర్ణాటక వాటాగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో సీమకు తుంగభద్ర నుంచి రావాల్సిన నీటిలో అన్యాయం జరిగింది. ఇక 1976 నాటి బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పుతో కృష్ణ నికర జలాలు 2060 టీఎంసీలలో (తుంగభద్ర నుండి లభ్యమయ్యే 480 టీఎంసీలు కూడా కలిపి) ఆంధ్రప్రదేశ్‌కు 800 టీఎంసీలు, అదనంగా 11 టీఎంసీలు పునరుత్పాదిత నీటిని కృష్ణలోని మిగులు నీరు, వరదనీరు వాడుకునే వెసులుబాటు ఏర్పడింది. కానీ 1981 నాటి అఖిలపక్ష నిర్ణయంతో కోస్తాకు 377.70 టీఎంసీలు (49.2 శాతం) తెలంగాణాకు 266.83 టీఎంసీలు (34.8 శాతం), రాయలసీమకు 122.70 టీఎంసీలు (16.8 శాతం), ఆవిరి ద్వారా నష్టానికి 32.77 టీఎంసీలు మొత్తంగా 800 టీఎంసీలు పంపకం జరిగింది. పంట భూముల విస్తీర్ణం, జనాభా, వెనుకుబాటుతనం వంటి అంశాల ఆధారంగా ఈ పంపకం జరుగలేదు.

రాయ‌ల‌సీమ‌కు రావ‌ల‌సిన నీటి వాటా

 
 ఈ అన్యాయాల‌న్నింటి గురించి ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం ధృష్టి పెట్టాలి. ఆంద్ర‌లోనే ప‌రిపాల‌న ప‌రిమితం చేస్తే రాజ‌కీయం గా ముఖ్య మంత్రి ఓకే ప్రాంతంలో ఉండాల్సి వ‌స్తుంది. ఏపీ రాజ‌ధాని ని ఆంద్ర వైపే మొగ్గుచూపారు. క‌నీసం రాయ‌ల‌సీమ‌కు రావ‌ల‌సిన నీటి వాటాను కేటాయిస్తే చాలాబాగుంటుంది  దీనిని ఈ తరం సీమ నాయకులు తెలుసుకోవాలి. ఆయా పార్టీల జెండాలకు జైకొట్టడం కాదు. పార్టీల్లోనూ చర్చకు పెట్టాలి.  బయటా కూడా పోరాడాలి. అసలు నీటి వనరుల విషయంలో సీమకు న్యాయం జరగాలంటే గోదావరి నదీ జలాలను వీలున్నంత మేరకు కృష్ణానదికి తరలించి, కృష్ణా డెల్టాకు అందించాలి. ఈ మేరకు కృష్ణానది నుంచి నికరజలాల్ని రాయలసీమలోని తెలుగుగంగ, గాలేరు- నగరి, హంద్రీ- నీవా వంటి ప్రాజెక్టులకు తరలించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: