ఎవరు గట్టిగా అరిస్తే వారు చెప్పేదే సత్యం అవుతుందా? లేదా, ఎవరు పదేపదే సవాళ్లు విసురుతూ ఉంటే వారు చెప్పేదే నిజం అని అంతా అనుకోవాలా? వారి డిమాండ్లలోనే నిజాయితీ ఉన్నదని నమ్మాలా? తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశలను, అనుసరిస్తున్న పోకడలను గమనిస్తే... ప్రస్తుతం అలాగే అనిపిస్తోంది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ఒక్కదానినే పట్టుకుని కొన్ని అర్థసత్యాలను పదేపదే ప్రచారం చేయడం ద్వారా... మైలేజీ పొందాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. 


పాలమూరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబునాయుడు అడ్డు పడుతున్నారనే ఆరోపణలు గుప్పించడం ద్వారా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నోరుమూయించాలనే.. కృతనిశ్చయంతో జూపల్లి కృష్ణారావు పోరాటం సాగిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుల గురించి బహిరంగ చర్చకు రమ్మంటూ సవాళ్లు విసరడం వరకూ ఆయన సక్సెస్‌ అయ్యారు. అయితే ఆయన తాజాగా తెతెదేపా ముందు పెట్టిన ఒక డిమాండు మాత్రం హాస్యాస్పదంగా ఉంది. 


పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చంద్రబాబునాయుడు వద్ద లేఖ తీసుకురావాలని... ఆయన సవాలు విసిరారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం మరొకటుంది. ప్రస్తుతానికి కేంద్ర జలసంఘం అనుమతులు వచ్చేవరకు ఎత్తిపోతల నిర్మాణం ఆపాలంటూ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ వచ్చి ఉంది. అందువల్ల ఈ గొడవ మొత్తం జరుగుతున్నట్లుగా ఉంది. నదీ ప్రవాహానికి దిగువ ప్రాంతాల్లో మరో రాష్ట్రం ఉనప్పుడు కొత్త ప్రాజెక్టులు కడితే.. కచ్చితంగా కేంద్ర జలసంఘం అనుమతి తీసుకోవాల్సిందే. దాని గురించి కేంద్రం లేఖ రాస్తే.. ఆ విషయం మాత్రం జూపల్లి మాట్లాడ్డం లేదు. 


పైగా.. వేర్వేరు కారణాల వల్ల తెతెదేపా నాయకులు మాట్లాడలేకపోవచ్చు గానీ.. సామాన్యులకు కలిగే సందేహం ఒకటున్నది. కేంద్ర జలసంఘం సిఫారసుల ప్రకారం.. కృష్ణాజలాలనుంచి తాము ఎన్ని టీఎంసీల నీటిని వాడుకోవాలని ఉన్నదో.. ఎత్తిపోతల నిర్మించినా సరే.. దానికి మించి చుక్క నీటిని కూడా వాడుకోబోయేది లేదని జూపల్లి కృష్ణారావు తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లేఖరాయించగలరా? ఆ మేరకు లేఖరాసి అనుమతులు సంపాదించుకుని కట్టగలరా? అలా అని ఆయన హామీ ఇస్తే.. పాలమూరు ఎత్తిపోతలకు తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు వద్ద లేఖ తేవడం తెతెదేపా వారికి కూడా ఇబ్బంది కాకపోవచ్చు. 


కాబట్టి జూపల్లి తెలుసుకోవాల్సింది ఒకటుంది. ఎంతసేపూ అర్థసత్యాలతో ఎదుటివారిని ఊదరగొట్టి బెదరగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటే కుదర్దు. ఎంత రాజకీయాలే అయినా... కొంత ప్రాక్టికల్‌గా కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: