వివాదాస్పద 26 జివొలకు సంబంధించి సుప్రీం కోర్టు నోటీసులను అందుకున్న ఆరుగురు మంత్రులలో నలుగురు మంత్రులకు న్యాయసహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరో ఇద్దరు మంత్రులకు న్యాయసహాయం అందటంలేదు. ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ జె.గీతారెడ్డి న్యాయసహాయాన్ని అందించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం జివొ (నెం,3102)ను జారీ చేసింది. పొన్నాల లక్ష్మయ్య, మోపిదేవి వెంకటరమణలకు రిక్తహస్తాన్ని చూపింది. మంత్రులు తరుఫున వాదించిన లాయర్లకు ఫీజులు చెల్లించేందుకు ఈ జివొ జారీ అయ్యింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో జారీఅయిన 26 జివొలు వివాదాస్ఫదమైన విషయం తెలిసిందే. ఈ జివొలను ఆరుగురు మంత్రులకు జారీ చేశారు. దాంతో వారందరికి సుప్రీ కోర్టు ఆరు మాసాల క్రితం నోటీసులను జారీచేసింది. తమకుప్త్వప్రభుత్వ పరంగా అండదండలు ఇవ్వాలని, ఆర్థిక సహాయంతో పాటు, న్యాయసహాయం అందించాలని ఆ మంత్రులంతా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డికి విన్నవించారు. వేరువేరుగా లేఖలు కూడా ముఖ్యమంత్రికి రాసారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి మీమాంసలో పడ్డారు. జలయజ్ఞం తాలుకు జివొలకు సంబంధించి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే రెండుసార్లు సిబిఐ ముందు హాజరయ్యారు. తాజాగా నలుగురు మంత్రులకు న్యాయసహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దాంతో నేడు ఉత్తర్వులు వెలువడ్డాయి. పొన్నాల, మోపిదేవిలకు న్యాయసహాయం నిరాకరించడంపై కొందరు అధికారులను అడుగగా ‘‘ మేము ఆరుగురు మంత్రులకు సంబంధించిన ఫైల్స్  ముఖ్యమంత్రికి పంపాము అయితే నలుగురికి సహాయం అందిస్తూ, ఇద్దరికి ఎందుకు అందించడం లేదో మాకు తెలియదు’’ అని అన్నారు. సహాయం కోరిన 8 మంది ఐఎఎస్ లు : ఈ జివొలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఐఎఎస్ అధికారులు కూడా తమకు న్యాయం, ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫైల్ ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: