యాకూబ్‌ మెమన్‌ కు ఉరిశిక్ష విధించడం అనే అంశం మీద.. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అనేక ఉగ్రవాద దాడులకు కారకుడిగా నిగ్గుతేల్చి మెమన్‌కు కోర్టు ఉరిశిక్ష విధిస్తే.. రకరకాల కారణాలు చూపిస్తూ జరిగిన నేరాలతో అతడికి సంబంధం లేదని.. కనుక క్షమించి వదిలేయాలని అర్థిస్తూ చాలామంది తమలోని ఆరాటాన్ని ప్రదర్శించారు. అసదుద్దీన్‌ లాంటి వారు.. సెక్యులర్‌ ప్రభుత్వాన్ని జడిపించడానికా అన్నట్లుగా.. ముస్లింగనుకనే మెమన్‌ను ఉరితీస్తున్నారని అంటూ.. అతని ఉరిశిక్షకు మతం తప్ప మరే నేరమూ లేదన్నట్లుగా తనదైన టోన్‌లో భాష్యం వినిపించారు. 


దీన్ని పూర్తిగా భారత్‌లో మతానికి జరుగుతున్న ద్రోహంగా, వివక్షగా అభివర్ణించడానికి మెమన్‌ను కాపాడడానికి నిర్ణయించుకున్న చాలా మంది కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఇదంతా.. ప్రభుత్వం లేదా క్షమాభిక్ష ప్రసాదించే అంశాన్ని పరిశీలించే న్యాయపీఠం మీద ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌ కింద పరిగణించాలి. కానీ అలాంటి వారి పాచికలు పూర్తిగా పారలేదు. మెమన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను సోమవారం నాడు సుప్రీం న్యాయస్థానం విచారించింది. దీనిపై పూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ విషయంలో ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోరింది. 


ముంబాయి పేలుళ్లకు కారకుడిగా మెమన్‌కు ఉరిశిక్ష పడింది. అయితే అతడి ఉరిని యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ ఆయన భార్య, మరికొందరు గతంలో రాష్ట్రపతికి కూడా విన్నవించుకున్నారు. వారి వేడుకోలును రాష్ట్రపతి కూడా తిరస్కరించారు. తాజాగా కూడా కొందరు ప్రముఖులు.. మెమన్‌ ఉరిశిక్షను మతానికి లింక్‌ పెడుతూ.. క్షమించి వదిలేయాలని మళ్లీ రాష్ట్రపతికి విన్నపాలు పంపారు గానీ.. అవికూడా ఆమోదం పొందే అవకాశం కనిపించడం లేదు. సుప్రీం కోర్టులో ఉన్న పిటిషన్‌ మాత్రం మంగళవారం తుది విచారణ తర్వాత ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: