ముంబాయి పేలుళ్ల సూత్రధారుల్లో ఒకరైన యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారైంది. తన ఉరిని తప్పించి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా యాకూబ్‌ మెమన్‌, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సమర్పించుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ మేరకు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రకటన వెలువడింది. బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్‌ భేటీ తర్వాత... హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ నేరుగా రాష్ట్రపతి భవన్‌కువెళ్లి.. ప్రణబ్‌ ముఖర్జీ తో దాదాపు గంటన్నరకు పైగా సమావేశం అయ్యారు. కేబినెట్‌ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు. వారి స మావేశం ముగిసి.. రాజ్‌నాధ్‌ వెళ్లిపోయిన తర్వాత.. రాష్ట్రపతి తన నిర్ణయాన్ని వెలువరించారు. దీంతో ఉరిశిక్ష ఖరారైంది. మరి కొద్ది గంటల తర్వాత నాగ్‌పూర్‌ జైలులో యాకూబ్‌మెమన్‌ను ఉరితీయబోతున్నారు. 


ఉరి తప్పించుకునేందుకు యాకూబ్‌ చేయని ప్రయత్నం లేదు. ఆయన చాలా కాలం ముందే రాష్ట్రపతికి విన్నవించుకున్నా తిరస్కరణ ఎదురైంది. ఒకసారి తిరస్కరించిన తర్వాత.. మళ్లీ దరఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండదని అంతా అంచనా వేశారు. ఈలోగా యాకూబ్‌ అసలు కోర్టులో న్యాయవిచారణ జరిగిన ప్రక్రియనే తప్పుపడుతూ మరో పిటిషన్‌ సుప్రీం కోర్టులో వేశారు. ద్విసభ్య బెంచ్‌ లో భిన్నాభిప్రాయాలు రావడంతో.. యాకూబ్‌ ఉరి గురించి చర్చ పెరిగిపోయింది. త్రిసభ్య బెంచ్‌ ఏర్పాటు అయింది. వారు విచారణ ప్రక్రియ అంతా సరిగానే ఉన్నదంటూ యాకూబ్‌ పెట్టుకున్న క్షమాభిక్షను తిరస్కరించారు. 


ఈలోగా.. మహారాష్ట్ర గవర్నర్‌కు కూడా మరొక క్షమాభిక్ష పిటిషన్‌ను యాకూబ్‌ మెమన్‌ పెట్టుకున్నారు. దానిపై కూడా బుధవారంసాయంత్రం నిర్ణయం వచ్చేసిది. గవర్నరు విద్యాసాగరరావు దాన్ని కూడా తిరస్కరించారు. రాత్రి 11 గంటల వరకు కూడా ఉరి గురించిన ఉత్కంఠ సాగుతూనే ఉంది. చిట్టచివరగా రాష్ట్రపతి నుంచి కూడా క్షమాభిక్ష దక్కకపోవడంతో ఉరిని అమలు చేయబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: