కొందరు నాయకులు ఉంటారు? తాము ఏదైనా పని చేయగలిగిన స్థాయిలో అధికార బలాన్ని కలిగి ఉన్నప్పుడు.. పూర్తి మౌనంగా మాత్రమే ఉంటారు. తీరా అధికారం ఉడిగిపోయిన తర్వాత.. తిరిగి ఇంతేసిలావు ప్రగల్భాలు అందుకుంటూ ఉంటారు. తమ సీజను ముగిసిపోయిన తర్వాత.. భారీ డైలాగులు వల్లించే ఇలాంటి వైఖరి రాజకీయ నాయకుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. బహుశా తాజాగా తెలంగాణ కోసం ఒకప్పుడు పోరాడిన, పోరాడినట్లు కనిపించిన, నటించిన నాయకుల మధ్య తాజాగా ఇలాంటి సెటైర్లే నడుస్తున్నట్లున్నాయి. 


ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కోదండరాం, జైపాల్‌రెడ్డి, మధుయాస్కీ తదితరప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ ఎంపీల పోరాటం వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటూ ఈ సమావేశంలో జైపాల్‌రెడ్డి ప్రకటించే సరికి తొలుత అంతా ఖంగుతిన్నారు. నిజానికి తెలంగాణ కోసం పోరాటం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లోనూ.. టీఎంపీలంతా.. రోడ్డున పడి అడుగుతున్న రోజుల్లోనూ... రాష్ట్రం మాకు కావాలంటూ.. ఒక్క మాట కూడా నోరు మెదపకుండా మౌనం పాటించిన వ్యక్తి అప్పట్లో కేంద్రమంత్రిగా కూడా ఉన్న జైపాల్‌రెడ్డి మాత్రమే. కాంగ్రెస్‌ ఎంపీలు కలవదలచుకున్నప్పుడెల్లా.. తన ఇంట్లో టిఫిను పెట్టడం తప్ప.. పోరాటానికి ఆయన ఎన్నడూ బహిరంగంగా సంఘీభావం కూడా చెప్పలేదు. అలాంటి నేత ఇప్పుడు కాంగ్రెస్‌ఎంపీల వల్లే రాష్ట్రం వచ్చిందనే సరికి.. ప్రొఫెసర్‌ కోదండరాం కు చిరాకెత్తినట్లుంది. 


ఆయన తన ప్రసంగంలో.. ''చదువరలు మౌనం ఉగ్రవాదం కన్నా పెద్ద నేరం'' అని ప్రొఫెసర్‌ జయశంకర్‌ భావించే వారంటూ.. గట్టిగానే చురకలు అంటించారు. అంటే ఆయన చాలా స్పష్టంగా.. తన అధికార సీజనుముగిసిపోయిన తర్వాత.. రాష్ట్రం కోసం డైలాగులు వేస్తున్న జైపాల్‌ మీదనే సెటైర్లు వేశారని అర్థమవుతోంది. జైపాల్‌రెడ్డి ఎంత పెద్ద మేధావి అయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం అంటూ వస్తే.. తాను తొలి ముఖ్యమంత్రి కావాలని, ఉమ్మడి రాష్ట్రానికి టీ-నేతను సీఎం చేసేట్లయితే.. చాన్సు తనకు కావాలని ఆరాటపడ్డారే తప్ప.. తెలంగాణ కోసం మాత్రం బహిరంగ ప్రకటనలు చేయకపోవడానికి ఇది ఎత్తిపొడుపు అనుకోవాల్సిదే. 


మరింత సమాచారం తెలుసుకోండి: