ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర అభివృద్ది లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సూచించింది... దానికి మద్దతుగా బీజేపీ కూడా ఓకే అంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ పాలన సాగుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గత కొంతకాలంగా మిన్నకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని ప్రధాని కార్యాలయం (పిఎంవో) తేల్చేసింది.  ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది.

 ఈ విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు పిఎంవో తరఫున వాణిజ్య శాఖ సమాధానం ఇచ్చింది. గత కొంత కాలంగా వైఎస్ జగన్ ఏపీ ప్రత్యేక హోదా గురించి పోరాడుతూ వస్తున్నారు. ఈ మద్య ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించారు. ఈ సందర్భంలో కేంద్రానికి ఆయన ఏపీ ప్రత్యేక హోదాపై లెఖ రాశారు. జగన్ లేఖకు ప్రధాని తరఫున ఆసిస్ దత్తా సమాధానం ఇచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి చెప్పారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ జగన్ లేఖకు కేంద్రం నుంచి వచ్చిన లేఖను ఆయన చదివి వినిపించారు.

జంతర్ మంతర్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నా


ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా చీల్చే టపుడు మిన్నకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి హోదా నిర్వహిస్తూ ప్రత్యేక హోదాపై కేంద్రంతో ఎందుకు చర్చించడం లేదని ఆయన అడిగారు. ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అంటూ తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుందా అని ఆయన అడిగారు. తామేమీ కొత్తగా గొంతెమ్మ కోరికలు అడగడం లేదని ఇచ్చిన హామీలు నెరవేర్చమనే అడుగుతున్నామని అన్నారు. కేంద్రం స్పష్టంగా చెప్పినా టిడిపి ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని ఆయన అడిగారు. తాము ఈ నెల 29వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: