రాజకీయ జోస్యాలు చెప్పడంలో సిద్ధహస్తుడైన లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అంచనా వేసుకోలేకపోతున్నారు. రాజకీయ భవిష్యత్ పై డైలమాలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేయాలో అర్ధంకాక తలపట్టుకుంటున్నారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో పరిస్థితులు ఎంతమాత్రం అనుకూలంగా లేకపోవడంతో.. మరో స్థానం కోసం లగడపాటి కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. తమకు ఎప్పుడూ అందుబాటులో ఉండని ఎంపీ లగడపాటి పట్ల విజయవాడ లోక్ సభ సెగ్మెంట్ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తనపై తాను నిర్వహించుకున్న సర్వేలో ఈవిషయం లగడపాటి దృష్టికి వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ప్రతికూల వాతావరణం కనిపిస్తుండడంతో పదిలమైన స్థానం కోసం లగడపాటి అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న పురంధేశ్వరి ఈసారి విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశాలుండటంతో.. ఆయన చూపు విశాఖపై పడినట్లు కనిపిస్తోంది. అయితే... పురంధేశ్వరి విశాఖపట్నం నుంచే పోటీ చేయాలనే నిర్ణయించుకుంటే మాత్రం లగడపాటికి కష్టాలు తప్పేలా లేవు. మరోవైపు లగడపాటి దృష్టిలో ఖమ్మం కూడా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలోని ఖమ్మం సీటు సేఫ్ కాదనే భయం లగడపాటిని వెంటాడుతోంది. దీంతో ఏ సీటు నుంచి పోటీ చేయాలో.. తమ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో అంతు చిక్కక లగడపాటి అంతర్మధనం చెందుతున్నారు. తెలంగాణా ఉద్యమంతో లగడపాటి కూడా రాష్టవ్యాప్త ప్రచారం పొందారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీనాయకుడిగా ఢిల్లీలో చక్రం తిప్పిన పర్వతనేని ఉపేంద్రకు అల్లుడై రాజకీయ, వ్యాపార రంగాల్లో అల్లుకుపోయి చివరకు మామకే కుచ్చుటోపి పెట్టారు. ఉపేంద్ర మరణానంతరం ఆయన వర్గీయులు పలువురు లగడపాటిపై బహిరంగంగానే కత్తి గట్టారు. లగడపాటి వ్యవహార శైలి, నైతిక ప్రవర్తన విజయవాడ లోక్ సభ పరిధిలోని కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా కమ్మ నాయకులకు ఏ మాత్రం రుచించడం లేదు. ఇటీవల ఈ కొందరు పలుకుబడి గల కమ్మ నాయకులు, వ్యాపార వేత్తలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై కూలంకుషంగా చర్చించినట్లు తెలిసింది. లగడపాటి ఎంపీగా తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని అనేక రేట్లు పెంచుకున్నాడే తప్ప తమకు ఒరగబెట్టిందేమీ లేదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. విజయవాడలో గతంలో కాంగ్రెస్ నాయకుడు కొలనుకొండ శివాజీ నిర్వహించిన లగడపాటి వ్యతిరేక వర్గీయుల సభకు కమ్మ సామాజిక వర్గం నేతలే డైరక్షన్లు ఇచ్చినట్లు తెలిసింది. అదును చూసి లగడపాటిని దెబ్బతీయాలనుకునే కమ్మ ప్రముఖుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. కమ్ముకొస్తున్న కమ్మ వ్యతిరేకతను లగడపాటి ఎలా ఎదుర్కొంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది. లోక్ సభ సభ్యుడుగా ఆయన ఈ నియోజకవర్గం అభివృద్ధిని పూర్తిగా విస్మరించారనే ఆరోపణలున్నాయి. చుట్టపు చూపుగా విజయవాడ వచ్చినపుడు హామీలు గుప్పించడం మినహా వాటిని అమలు చేసిన దాఖలాలు లేవని సొంత పార్టీ నేతలే నిందిస్తున్నారు. ఓ వైపు జగన్ పార్టీ దూకుడు, మరోవైపు సొంతపార్టీ, నియోజకవర్గ ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతున్ననేపథ్యంలో విజయవాడను వదిలి మరో సీటు కోసం సీమాంధ్రలో ఉధృతంగా గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: