ఈ మద్య  కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతమైపోయాయి..డ్రైవర్ల అజాగ్రత్త వల్లనో.. అనుకోకుండా రోడ్డుపై ఏదైనా అడ్డు రావడం వల్లనో..అత్యంత వేగం వల్ల అదుపు చేయలేని పరిస్థితుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఏదేమైనా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిసోతున్నాయి.  రోడ్డు రవాణా సంస్థ ఎన్ని భద్రతాచర్యలు తీసుకున్నప్పటికీ జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు.  బస్సు, లారీ అతివేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. 


మితిమీరిన వేగం కారణంగా మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి నల్గొండకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ( AP29Z 2270)ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు అదుపు తప్పి లొయలోపడి నుజ్జు నుజ్జు అయ్యింది.  ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు.  లారీ డ్రైవర్ పొరబాటు వల్ల ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో... బస్సులోనే చాలా శవాలు నుజ్జునుజ్జు అయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 26 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు భువనగిరి, నల్గొండ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. భువనగరి, నల్గొండల నుంచి రెస్క్యూ టీంలు వస్తున్నాయి.


ప్రమాదం జరిగిన  సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు సంఘటనా ప్రదేశానికి బయలుదేరారు. అలాగే స్థానిక రాజకీయ నాయకులు కూడా బయలుదేరారు.జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డిలను సంఘటన స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. కాగా, లారీ ఢీకొనడంతో బస్సు పక్కనే ఉన్న లోయలో పడింది. జెసిబిని తీసుకు వచ్చి లారీనీ, బస్సును వేరు చేసి మృతదేహాలను తీశారు.  మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: