ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నగరాన్ని ప్రారంభిస్తున్న వేడుక కాదు ఇది. కేవలం శంకుస్థాపన మాత్రమే. శంకుస్థాపనను కూడా ఇంతభారీగా నిర్వహించాలా అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. అది సహజం కూడా! పైగా కేవలం పునాది రాయి వేయడానికి ఇన్ని కోట్ల రూపాయలు (ఒక అంచనా ప్రకారం 22 కోట్లు) వెచ్చించి ఒక జాతర లాగా అంతర్జాతీయ స్థాయి వేడుకలాగా నిర్వహించాలా అని నివ్వెరపోతున్న ప్రజలున్నారు. ఇలాంటి అందరి సందేహాలకు ఉమ్మడిగా ఒక ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తూ చంద్రబాబునాయుడు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంత డాంబికంగా వేడుక నిర్వహించడం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటో ఆయన నిర్మొగమాటంగా పంచుకున్నారు. 


'శనివారం నాడు కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత మీడియాతో ముచ్చటించిన చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం విశేషం. ఇంతపెద్ద రాజధాని నగరం కడుతున్నప్పుడు ప్రపంచం మొత్తం మనవైపు చూసేంత ఘనంగా నిర్వహిస్తే తప్ప.. మనకు పెట్టుబడులు పెద్దగా రావు. ఇదంతా ఒక మార్కెటింగ్‌ ఈ రోజుల్లో మార్కెటింగ్‌ లేకుండా ఏ పనులూ జరగవు. మనం ఎంత బాగా మన నగరం గురించి ఇక్కడి అవకాశాల గురించి మార్కెటింగ్‌ చేసుకుంటే అంతగా మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. భారీస్థాయిలో మార్కెటింగ్‌ జరిగితే లాభాలు కూడా భారీగానే వుంటాయి. దీన్నంతా వృథా ఖర్చు కింద చూడకూడదు అని ఆయన వెల్లడించారు. 


మార్కెటింగ్‌ ఉంటే తప్ప.. ఈరోజుల్లో మనుగడ ఉండదనే జీవితసత్యం చంద్రబాబుకు స్వానుభవంలో కూడా బాగానే బోధపడిన తత్వసారం. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన తనను తాను మార్కెటింగ్‌ చేసుకోవడంలో ప్రజాధనాన్ని విపరీతంగా తగలేశారనే ఆరోపణలు బీభత్సంగా వచ్చాయి. అప్పట్లో ఆయన ఏపీసీఈవోగా తనను తాను ప్రచారం చేసుకుంటూ.. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించేలా మార్కెటింగ్‌ స్ట్రాటెజీలు చేసుకోగలిగారు కానీ.. స్థానికంగా రాష్ట్ర ప్రజలు మాత్రం ఎన్నికల్లో ఆయనను తిప్పికొట్టారు. 


ఆతర్వాతి రోజుల్లో రాజకీయ నాయకుల మార్కెటింగ్‌ తెలివితేటలకు డిమాండ్‌ పెరిగిపోయింది. ఇప్పుడు సెల్ఫ్‌ మార్కెటింగ్‌లో ప్రధాని నరేంద్రమోడీ.. చంద్రబాబు లాంటి వారి తలదన్నేలా ప్రవర్తిస్తున్నారు. మన దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచ దేశాధినేతల్లోనే నరేంద్రమోడీకి లభిస్తున్న మార్కెటింగ్‌ మరెవ్వరికీ లభించడం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇటు సరైన మార్కెటింగ్‌ మాత్రమే విజయసూత్రం అని నమ్మే ముఖ్యమంత్రి.. అదే సిద్ధాంతాన్ని అంతకంటె ఘాటుగా ఆచరించే ప్రధానమంత్రి.. వీరిద్దరి కాంబినేషన్లో.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అనేది కేవలం ఒక మార్కెటింగ్‌ కార్యక్రమం లాగా మాత్రమే జరిగితే గనుక అందులో సందేహం ఏముంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: