ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు, ప్రేమకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుంది. కొందరు వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే మరికొందరు మాత్రం తక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లటంలోను ఆ స్థానం నుంచి పాతాళానికి తొక్కేయడంలోను డబ్బు, ప్రేమ కీలక పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తి జీవితాన్ని డబ్బు, ప్రేమ క్షణాల్లో మలుపు తిప్పగలవు. డబ్బు, ప్రేమ భిన్నమైనవే అయినప్పటికీ పలు సందర్భాల్లో ఒకదానిని మరొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. 


 
డబ్బు... నేటి సమాజంలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారికే విలువ. సమాజంలో చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను గుణగణాలు బాగాలేకపోయినా, చెడు అలవాట్లు ఉన్నా శ్రీమంతులకే ఇచ్చి పెళ్లి చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి వివాహాల్లో పెళ్లైన తరువాత విడాకులు తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారు. మరికొంతమంది డబ్బుపై వ్యామోహంతో అబద్ధాలు చెప్పి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వివాహం అనంతరం పెళ్లికొడుకు చెప్పినవి అబద్ధాలు అని తెలిసినా కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెళ్లికూతురు తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. 


 
ప్రేమ.... నేటి సమాజంలో సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం వల్ల యువతలో చాలామంది యుక్తవయస్సులోనే ప్రేమ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ ప్రేమ వల్ల కొందరి జీవితాలు బాగుపడుతుంటే మరికొందరి భవిష్యత్తే నాశనమవుతోంది. కొందరు ప్రేమలో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 


 
ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు, ప్రేమ రెండూ ముఖ్యమైనవే. ఈ రెండింటి విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా వహించాలి. వీటికి జీవితంలో ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఏదో ఒకరోజూ ప్రతికూల ఫలితాలు వచ్చి జీవితాంతం బాధ పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల జీవితంలో డబ్బు, ప్రేమను నమ్మకపోవడమే మంచిది. ఇవి రెండూ మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలవో అంతే ఎత్తు నుంచి కింద పడేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: