మన జీవితంలో చదువుకునే సమయంలో, ఉద్యోగాలు చేసే సమయంలో చాలా మంది అపరిచిత వ్యక్తులు పరిచయమవుతారు. అలా పరిచయమైన వారిలో కొందరు మంచి స్నేహితులుగా మిగిలితే మరికొందరితో అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, జీవిత భాగస్వామి... ఇలా వివిధ బంధాలు ఏర్పడతాయి. అలా పరిచయమై మన జీవితంలో భాగం అయిన వారు మన బాధల్లో, సంతోషంలో ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. 


 
మనకు ఏ కష్టం వచ్చినా మన కష్టాలను వాళ్లు తమ కష్టంగా భావిస్తారు. మనకు వీలైనంత సహాయం చేయడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తారు. మన సంతోషంలో తమ సంతోషం వెతుక్కునే స్నేహితులు కూడా ఉంటారు. మనం సక్సెస్ సాధిస్తే ఆ సక్సెస్ ను తమ సక్సెస్ గా భావించే స్నేహాలు, బంధాలు కోకొల్లలు. మనకు పరిచయమైన వారిలో అందరూ అలా ఉండరు కానీ ప్రతి ఒక్కరికీ అలాంటివాళ్లు కొందరైనా తప్పనిసరిగా ఉంటారు. 


 
కానీ అలాంటి స్నేహాలు, బంధాలతో ఏదో ఒక సందర్భంలో చిన్నచిన్న వివాదాలు తలెత్తుతాయి. ఆ వివాదాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయకపోతే వివాదం మరింత పెద్దదవుతుంది. చివరకు ఎన్నో ఏళ్ల నుంచి మనకు తోడుగా ఉన్న బంధాలు, స్నేహాలు దూరమవుతాయి. ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా మెలిగిన వారే తరువాత కాలంలో శత్రువులయ్యే ప్రమాదం కూడా ఉంది. 


 
జీవితంలో మన స్నేహితుల, బంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరంగా వారిపై కోపాన్ని ప్రదర్శించకూడదు. అవతలి వ్యక్తులు తప్పు చేశామని చెబితే వారిని క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. అవతలి వ్యక్తులదే తప్పు ఉంటే వాళ్లు చేసిన తప్పు గురించి అర్థమయ్యేలా వివరించాలి. మన స్నేహితులు, బంధాలు చేసిన చిన్నచిన్న తప్పులను క్షమిస్తే ఆ బంధాలు మన జీవితాంతం తోడుగా ఉంటాయి.            

మరింత సమాచారం తెలుసుకోండి: